ఆశలు ఆవిరి.. | - | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి..

Oct 30 2025 10:09 AM | Updated on Oct 30 2025 10:09 AM

ఆశలు

ఆశలు ఆవిరి..

చేలమీద తడిసి ముద్దవుతున్న పత్తి

యాచారం: కురుస్తున్న వర్షాలతో తెల్లబంగారం నల్లబడుతోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పత్తి ఏరలేని దుస్థితి నెలకొంది. దీంతో చేతికందొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగా వచ్చిందని, మద్దతు ధర కూడా ఆశించిన మేర ఉందన్న ఆనందం కాస్త ఆవిరైందని వాపోతున్నారు.

1.40 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఈ ఏడాది 60 వేలకు పైగా రైతులు.. 1.40 లక్షల ఎకరాలకు పైగా పత్తిని సాగు చేశారు. అత్యధికంగా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్‌, యాచారం, కందుకూరు, మంచాల తదితర మండలాల్లో పండించారు. ఈ ఏడాది అదునులో వర్షాలు కురవక పోయినా.. పత్తి సాగుపై మక్కువ చూపారు. ఒక్కో రైతు 5 నుంచి 50 ఎకరాల్లో రూ. లక్షలు పెట్టుబడి పెట్టి బంగారం పండించారు.పంట బాగా పండిందని, మంచి లాభాలు పొందుదామనే సమయంలో అధిక వానలు పడి.. వారి పాలిట శాపంగా మారాయి. వేలాది ఎకరాల్లోపంట తీవ్రంగా దెబ్బతిన్నది.

నష్టాన్ని మిగిల్చింది

ఈ ఏడాది పత్తి ధర ఆకాశాన్నంటింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా క్వింటా ధర రూ.8 వేలకు పైగానే డిమాండ్‌ ఉంది. పంటకు పెద్దగా తెగుళ్లు సోకక పోవడం, పూత, కాత బాగా పండటంతో ఈ ఏడు బాగా కలిసి వచ్చిందని రైతులు మురిసిపోయారు. సిరుల పంట పండినట్లేనని భావించారు. కానీ.. వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. పంట ఇంటికి వచ్చే సమయంలో కుండపోత వర్షాలు నేలపాలు చేశాయి. పత్తి చెట్లపైనే తడిసి, రంగుమారింది. మొలకెత్తడం తదితర కారణాలతో ధరలో భారీగా వ్యత్యాసం నెలకొందని ఆందోళన చెందుతున్నారు. లాభాలు వస్తాయని ఆశిస్తే.. నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

అడియాశ..

ఈ ఏడాది సీసీఐ కేంద్రాల్లోనే మద్దతు ధర బాగానే ఉంది. మరింత పెరుగుతుందనే ఆశతో చాలా మంది రైతులు.. చేను నుంచి తెచ్చిన దిగుబడిని ఇళ్లల్లోనే పెట్టుకుంటున్నారు. కానీ.. వారి ఆశలను కుండపోత వర్షాలు అడియాశలు చేశాయి. దిగుబడిని అమ్ముకోలేక, మిగతాపంటను ఏరలేక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా మాడ్గుల, యాచారం, తలకొండపల్లి, మంచాల, ఆమనగల్లు మండలాల్లోని గ్రామాల్లో ఇదే దుస్థితి నెలకొంది.

చేనులోనే తడిసిపోతోంది

తీత సమయంలో వర్షాలు కురిశాయి. దీంతో పత్తి మొత్తం చెట్లపైనే ఉండిపోయింది. తడిసిపోతోంది. రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి, 38 ఎకరాల్లో సాగు చేశాను. కానీ.. ఎడతెరిపి లేని వానలు తీవ్ర నష్టం కలిగించాయి. పత్తి తడిస్తే బరువు, రంగులో తేడా వస్తుంది. తీసిన పత్తిని అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.

–నూనే మహేశ్‌, రైతు మాడ్గుల

ఆదుకోవాలి

ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడి దక్కుతుంది. ప్రస్తుత వానల కారణంగా ఎకరాకు 5 క్వింటాళ్లు వచ్చేలా లేదు. విత్తనం మొదలు.. పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.25 వేలనుంచి 30 వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుత వర్షాలతో పత్తి తడిసిపోయింది. పెట్టుబడి వచ్చేలా లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

– రమేష్‌కుమార్‌, రైతు, పూడూరు, వికారాబాద్‌

నల్లబడుతున్న తెల్ల బంగారం

ఆందోళన చెందుతున్న రైతులు

ధర ఉన్నా.. చేతికందని పంట

ఆశలు ఆవిరి.. 1
1/2

ఆశలు ఆవిరి..

ఆశలు ఆవిరి.. 2
2/2

ఆశలు ఆవిరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement