మోంథా.. మోత | - | Sakshi
Sakshi News home page

మోంథా.. మోత

Oct 30 2025 10:15 AM | Updated on Oct 30 2025 10:15 AM

మోంథా.. మోత

మోంథా.. మోత

నమోదైన వర్షపాతం వివరాలు

ఏకధాటి వర్షానికి అంతా అతలాకుతలం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. రోజంతా ఏకధాటిగా కురిసిన మోంథా తుఫాన్‌ ఉమ్మడి జిల్లా రైతులకు తీరని నష్టాలను మిగిల్చింది. చేతికి అందివస్తుందనుకున్న పత్తి చేనులోనే తడిసి ముద్దయింది. వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటికే రాశులుగా పోసిన ధాన్యంపై టార్పలిన్లు లేక వర్షానికి తడిసిపోయాయి. పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. టమోటా, ఆకు కూరలు సహా ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లరేగడి, ఎర్ర నేలల్లోనూ భారీగా వర్షపు నీరు నిల్వ ఉండడం, మోకాల్లోతు దిగబడుతుండడం వల్ల రైతులు, కూలీలు పంట పొలాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా బంతి, చామంతి, గులాబీ పూలు సహా బెండ, దొండ, కాకర, బీర, దోస ఇతర తీగజాతి పంటలను కోసి మార్కెట్‌కు తరలించలేని దుస్థితి. కొందుర్గు, ఫరూఖ్‌నగర్‌, కేశంపేట, ఆమనగల్లు, కడ్తాల్‌, యాచారం, మంచాల, చేవెళ్ల, షాబాద్‌, మెయినాబాద్‌ మండలాల్లోని రైతులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. మూసీ, ఈసీ వాగులు సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. ఉస్మాన్‌సాగర్‌కు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 1,867 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా 3,963 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

దెబ్బతిన్న రోడ్లు.. ఎక్కడిక్కడే ట్రాఫిక్‌ జాం

ఏళ్లుగా రోడ్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంలోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపైకి భారీగా వరద వచ్చి చేరడం, భారీ వాహనాల రాకపోకల సమయంలో ఆయా రోడ్లు దెబ్బతిన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఔటరు నుంచి ఇబ్రహీపట్నం మీదుగా నాగార్జునసాగర్‌కు వెళ్లే రోడ్డుపై అడుగుకో గుంత తేలికన్పిస్తోంది. శ్రీశైలం జాతీయ రహదారిపై సైతం ఇదే పరిస్థితి. శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ మీదుగా వెళ్లే బెంగళూరు జాతీయ రహదారి సహా అప్పా జంక్షన్‌ నుంచి బీజాపూర్‌ వెళ్లే జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. గ్రామీణ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గుంతల్లో వర్షపునీరు నిల్వ ఉండడం, వేగంగా వచ్చి ఆ గుంతల్లో గుద్దుకోవడంతో వాహనాల డిస్కులతో పాటు ఆయా వాహనాలపై ప్రయాణిస్తున్న వాళ్ల వెన్ను పూసలు కదిలిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం, రోడ్లపై వరదనీరు ప్రవహిస్తుండటంతో ఎల్బీనగర్‌–వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట మీదుగా మెహిదీపట్నం వెళ్లే మార్గం సహా సైబరాబాద్‌ పరిధిలోని శేరిలింగంపల్లి, నానక్‌రాంగూడ, గండిపేట, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ నుంచి జేఎన్‌టీయూ మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు గంటల తరబడి వర్షంలోనే తడిసి ముద్దవ్వాల్సి వచ్చింది. రోజూవారీ కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు వర్షానికి ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఏకధాటి వర్షాలకు రైతులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు మాత్రం ఇంటి గడపదాటి బయటికి రాకపోవడం గమనార్హం.

అటు మబ్బులు.. ఇటు జబ్బులు

ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుని రోజంతా ధారలుగా వర్షం కురుస్తూనే ఉంది. ఇందుకు చలిగాలులు తోడయ్యాయి. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం అంత త్వరగా ఇముడ్చుకోలేక పోతోంది. దీనికి తోడు ఇళ్ల మధ్య రోజుల తరబడి మురుగు నిల్వ ఉండడం, వీధుల్లో ఎక్కడ చూసినా భారీగా చెత్త పేరుకుపోవడం, ఈగలు, దోమలు వ్యాప్తి చెందడం, పల్లెలతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ్య లోపం తలెత్తి ఆయా ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా అస్వస్థతకు గురవుతున్నారు. పేదలు, నిరక్ష్యరాస్యులు ఎక్కువగా నివసించే నందనవనం, ఎరుకల నాంచారమ్మ బస్తీ, తట్టి అన్నారం, కుంట్లూరు, బంజారాకాలనీ, నాదర్‌గుల్‌, కుర్మల్‌గూడ, లెనిన్‌నగర్‌, మిథానిబస్తీ, ఆర్సీఐ రోడ్‌కు అటు ఇటుగా వెలసిన పేదల బస్తీలు సహా, మల్లాపూర్‌, కాటేదాన్‌, జల్‌పల్లి, పహాడీషరీఫ్‌ తదితర ప్రాంతాల్లోని రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న నిరుపేదలు ఎక్కువగా అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే అనేక మంది దగ్గు, జలుబు, జ్వరంఒంటి నొప్పులతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పల్లె దవాఖానాల్లో వైద్యులు లేక పోవడం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నిష్పత్తి మేరకు మందులు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇష్టం లేకపోయినా మెజార్టీ బాధితులు ప్రైవేట్‌ క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. రోగుల్లోని బలహీనతను ఆయా ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. సాధారణ జ్వరాలను సైతం డెంగీ జ్వరాల జాబితాలో చేర్చి, అత్యవసర సేవలు, ప్లేట్‌లెట్‌ చికిత్సల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.

తలకొండపల్లిలో 11.72 సెంటీమీటర్ల వర్షపాతం

దెబ్బతిన్న పంటలు.. తడిసిన ధాన్యం

వాతావరణ మార్పులతోమంచం పట్టిన పల్లెలు

దగ్గు, జలుబు, జ్వరం, ఒల్లు నొప్పులతో ఆస్పత్రులకు క్యూ..

మండలం వర్షపాతం

(సెం.మీ.లలో)

తలకొండపల్లి 11.72

ఆమనగల్లు 8.16

కేశంపేట 6.29

కొందుర్గు 5.71

మాడ్గుల 5.60

మహేశ్వరం 4.74

నందిగామ 4.62

కడ్తాల్‌ 4.41

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement