విద్యాభివృద్ధిలో ప్రభుత్వం విఫలం
బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్‌కుమార్, కొనుకటి ప్రశాంత్ మండిపడ్డారు. హలో విద్యార్థి, చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్, ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రజాపాలన ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. విద్యా భరోసా కార్డు, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు హామీలు అమలయ్యే వరకు పోరాటం ఆపమన్నారు. జిల్లా కోఆర్డినేటర్లు పాండుగౌడ్, జగన్‌గౌడ్ పాల్గొన్నారు.


