సొంత ఆదాయ వనరులతోనే గ్రామాభివృద్ధి
సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
కడ్తాల్: పంచాయతీల అభివృద్ధి సొంత ఆదాయ వనరులపైనే ఆధారపడి ఉంటుందని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజేంద్రనగర్‌లోని వికాస్ ఆడిటోరియంలో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ రాజ్ చట్టం– 2018 ప్రకారం గ్రామాలకు సంబంధించిన అధికారాలు, వినియోగాల గురించి వివరించారు. పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ఇంటి, వినోదపు పన్ను, వారాంతపుసంత, వృత్తి వ్యాపార లైసెన్స్ మంజూరు ద్వారా వచ్చే ఆదాయం, పన్ను వసూలు, వివిధ ఆదాయ వనరుల గురించి పేర్కొన్నారు. తెలంగాణలో సర్పంచ్‌ల హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని, దానికి అనుగుణంగానే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు అందాయని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు, గ్రామపంచాయతీ పాలక వర్గం సమష్టికృషి, సొంత ఆదాయ వనరుల కూర్పు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ దిలీప్ కుమార్‌పాల్, అంజన్‌కుమార్ బాంజియా, అన్నాదొరై, అజిత్ కుమార్, ఆశాలత, ఉపేందర్, రాజేందర్, విద్యులత తదితరులు పాల్గొన్నారు.


