పత్తి రైతు దిగాలు
● కురుస్తున్న వర్షాలకు తడుస్తున్న పంట
● పొలాల్లోనే రాలిపోతున్న తెల్ల బంగారం
● దిగుబడిపై తీవ్ర ప్రభావం
షాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చేనుపైనే పత్తి తడిసి ముద్దయింది. పగలు కాస్తున్న ఎండలకు ఆరిపోవడంతో పత్తిలో నాణ్యత దెబ్బ తింటుంది. తెల్ల బంగారంగా పిలువబడే ఈ పంటను చేవెళ్ల డివిజన్‌లో అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారు. కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అయితే ఈసారి పత్తికి కాలం కలిసి రాలేదనే చెప్పాలి. వానాకాలం సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. తీరా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలతో కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
31,220 ఎకరాల్లో సాగు
ఈ సీజన్‌లో చేవెళ్ల డివిజన్‌లో 31,220 ఎకరాలకు పైగా పత్తి సాగు చేసిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే విత్తనాలు వేసిన సమయంలో సరైన వర్షాలు కురవక పోవడంతో పంట ఎదుగుదల లోపించింది. కాయలు కాసిన తర్వాత కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచి రంగుమారి దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పత్తి పంట ఏరేందుకు సిద్ధంగా ఉంది. పత్తితీత సమయంలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో వర్షానికి పత్తి నేల రాలుతోంది. పంట దెబ్బతినడంతో పాటు నాణ్యత లోపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బరువు కూడా తగ్గి పోతుందని వాపోతున్నారు. ఎకరా విస్తీర్ణంలో పత్తి పంట వేసిన నాటి నుంచి పంట తీసి మిల్లుకు తరలించే వరకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు పంట బాగా పండితే 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడివచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో అందుకు భిన్నంగా కేవలం 5 క్వింటాళ్లలోపే వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
తేమ ఆధారంగా మద్దతు ధర
పత్తి పంటను కొనుగోలు చేసేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్‌కు రూ.8,110 చొప్పన మద్దతు ధరను నిర్ణయించారు. సీసీఐలో అమ్ముకునేందుకు తప్పనిసరిగా 8 నుంచి 12 తేమ శాతం లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే అమ్ముకునేందుకు వీలు ఉండదు. తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరను నిర్ణయించనున్నారు.
దెబ్బతింటోంది
జూన్ మొదటి వారంలో పత్తిని సాగు చేశా. పత్తి మొదటి తీత సమయంలోనూ వర్షంతో చేనుపైనే తడిసింది. ప్రస్తుతం రెండోతీత తీద్దామని అనుకుంటుండగానే వర్షం కురుస్తోంది. వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు, మొలకెత్తే ప్రమాదం పొంచి ఉంది.
– నర్సింహారెడ్డి, రైతు, మన్‌మర్రి, షాబాద్
పరిహారం ఇవ్వాలి
అధిక వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం క్వింటాల్‌కు కనీసం రూ.12 వేలు నిర్ణయించాలి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. దీంతో వెచ్చించిన పెట్టుబడులు వస్తే చాలని భావిస్తున్నాం. దెబ్బతిన్న పంటలపై సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలి.
– శేఖర్, రైతు, తిమ్మారెడ్డిగూడ, షాబాద్
పత్తి రైతు దిగాలు
పత్తి రైతు దిగాలు
పత్తి రైతు దిగాలు


