ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదు
యాచారం: ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి రైతులు స్పష్టం చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం సమావేశమై తీర్మానించారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ఎలా ఇస్తామని ప్రశ్నించారు. భూసేకరణను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు గ్రామంలోకి వచ్చి సర్వే చేసినా, భూముల్లోకి వచ్చినా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గ్రామంలోని భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తెల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరి 36వ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం తుర్కయంజాల్‌లో వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దున్నె వాడికే భూమి దక్కాలని అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. పాషా, నరహరి స్ఫూర్తితో పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సత్యనారాయణ, ఆశీర్వాదం, భాస్కర్, అరుణ్‌కుమార్, భాస్కర్ రెడ్డి, మాధవ రెడ్డి పాల్గొన్నారు.
యాచారం: ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు పేర్కొన్నారు. నక్కర్తమేడిపల్లిలోని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ స్తూపం వద్ద ఆదివారం వారు సమావేశమయ్యారు. సర్కార్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామనే భయంతోనే రైతులు వేసిన నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు వేసినా తిరస్కరించడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మంచాల: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారుల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నమోని శంకర్ డిమాండ్ చేశారు. మత్స్యకారుల కార్మిక సంఘం సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని ఆగాపల్లి, కాగజ్‌ఘట్ గ్రామాల్లో సంఘం జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని, మత్స్యకారుల సొసైటీ అభివృద్ధికి రూ.5వేల కోట్లు విడుదల చేయాలని, ఉచితంగా చేప పిల్లలు అందించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. కబ్జాదారుల నుంచి చెరువులు, కుంటలకు విముక్తి కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బోధ్రమోని నర్సింహ, పసుల రవీందర్, నాగరాజ్, యాట రమేష్, యాదయ్య, దుర్గయ్య, ధనంజయ్య, అశోక్, వెంకటేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.
ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదు
ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదు


