ఫలించిన పోరాటం
షాద్‌నగర్: పౌల్ట్రీ పరిశ్రమను వ్యవసాయ అనుబంధ రంగంగా పరిగణించి ఆస్తి పన్ను రద్దు చేయాలని పౌల్ట్రీ రైతులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. పలుమార్లు మంత్రులను, అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షాద్‌నగర్‌లో 118 మంది పౌల్ట్రీ రైతులకు రూ.5 కోట్లకు పైగా ఆస్తి పన్ను బకాయి రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
ఆంధ్రా నుంచి వలస వచ్చి..
40 ఏళ్ల క్రితం ఆంధ్రా ప్రాంతం నుంచి సుమారు 150 మంది రైతులు షాద్‌నగర్‌కు వలస వచ్చారు. ఫరూఖ్‌నగర్ మండలం చటాన్‌పల్లి శివారులో ఎంపీ శేషయ్యనగర్‌తోపాటు సోలీపూర్, రాయికల్, చిల్కమర్రి, బూర్గుల తదితర గ్రామాల్లో పౌల్ట్రీలను ఏర్పాటు చేసుకున్నారు. లేయర్ కోళ్ల ఫారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పౌల్ట్రీని వ్యవసాయ అనుబంధరంగ సంస్థగా గుర్తించి ఆస్తి పన్ను రద్దు చేశారు. అప్పటి నుంచి రైతులు తమ ఇళ్లకు తప్ప పౌల్ట్రీ ఫారాలకు పన్నులు చెల్లించలేదు.
విలీనంతో ఇబ్బందులు
2011 ఆగస్టు 24న ప్రభుత్వం మేజర్ పంచాయతీగా ఉన్న షాద్‌నగర్‌ను మున్సిపాలిటీగా మార్చారు. శివారులో ఉన్న చటాన్‌పల్లి, సోలీపూర్ పంచాయతీలను సైతం మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీలకు ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.5కోట్లకు పైగా పన్నులు చెల్లించాల్సిందేనని రైతులపై కోర్టులో కేసులు వేశారు.
ఎమ్మెల్యే కృషితో రద్దు
బకాయిలు రద్దు చేయాలని కోరుతూ కొన్నేళ్లుగా పౌల్ట్రీ రైతులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. షాద్‌నగర్ ప్రాంతానికి విచ్చేసిన మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 118 మంది రైతులకు సంబంధించి రూ.5.50 కోట్ల పన్నుల బకాయిలు రద్దు చేశారు. ఈమేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి ఈనెల 24న జీఓ 213 జారీ చేశారు.
పౌల్ట్రీ రైతుల సంబురాలు
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం కావడంతో పౌల్ట్రీ రైతులు సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు.
పౌల్ట్రీ రైతులకు ఆస్తి పన్ను బకాయిలు రద్దు
జీఓ జారీ చేసిన ప్రభుత్వం
షాద్‌నగర్‌లో 118 మందికి రూ.5 కోట్లకు పైగా లబ్ధి


