డక్కలి కులస్తులను ఆదుకోవాలి
షాద్‌నగర్‌రూరల్: గుడిసెలు వేసుకొని కాలం వెల్లదీస్తున్న డక్కలి కులస్తులకు వెంటనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని న్యూసిటీ కాలనీలో డక్కలి కులస్తులు వేసుకున్న గుడిసెలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డక్కలి కులానికి చెందిన దాదాపు 60 కుటుంబాలు గుడిసెలు వేసుకొని దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీలిచ్చి ఓట్లు దండుకుంటున్నాయని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పక్కా ఇల్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని భూ యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో వారు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని అన్నారు. వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి, రాంచంద్రయ్య, జంగమ్మ, యాదయ్య, రాములు, వెన్నెల, రేణుక, చంద్రకళ, కవిత, కళమ్మ తదితరులు పాల్గొన్నారు.


