
సమన్వయంతో పని చేయాలి
ఇబ్రహీంపట్నం: అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం, అంతకు ముందు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం, అంగన్‌వాడీ, వ్యవసాయ తదితర శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా గమనించాలని, లోపాలుంటే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెరుగుదల లోపం ఉన్న చిన్నారులను అంగన్‌వాడీ, మెడికల్ సిబ్బంది గుర్తించి వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలన్నారు. వీధిలైట్లు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.