
బయటకు రాని
బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు జీహెచ్‌ఎంసీ మలక్‌పేట పరిధిలో గోదాములకే పరిమితమయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలందరికీ రేషన్ కార్డుల ప్రాతిపదికన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఇందిరా మహిళా శక్తి పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు గత నెల 25 వేల చీరలు మలక్‌పేటకు చేరాయి. మిగతా చీరలు వచ్చాక పంపిణీ చేసేందుకు అధికారులు పండగకు ముందే అన్ని ఏర్పాట్లు చేసినా మిగతావి దిగుమతి జరగలేదు. ఈ కారణంతో బతుకమ్మ వేడుక సందర్భంగా పంపిణీ చేపట్టలేదు. – చాదర్‌ఘాట్
గోదాంలకే పరిమితం
బతుకమ్మ చీరలు!
నవంబర్ 19న పంపిణీ?
పొదుపు సంఘాల మహిళలకు బతుకమ్మ వేడుక కోసం చీరలు పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అన్ని సర్కిళ్ల పరిధిలోని వార్డు కార్యాయాల్లో పొదుపు సంఘం ఖాతా బుక్కును చూపించి పేర్లు నమోదు చేసుకొని మహిళలకు చీరల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వాయిదా పడింది. పండుగ సందర్భంగా కొందరు మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇంధీరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తారని చర్చించుకుంటున్నారు.
మలక్‌పేటలో 50 వేల చీరలు
జీహెచ్‌ఎంసీ మలక్‌పేట పరిధిలో సర్కిల్ కార్యాయాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు వార్డు కార్యాలయంలో అధికారులు పంపిణీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆరు డివిజన్లలో 25 వేల మంది మహిళ పొదుపు సంఘాల సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పొదుపు మహిళకు 2 చీరల చొప్పున మొత్తం 50 వేల చీరలు పంపిణీ చేయనున్నారు.
అర్బన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో..
ఆయా డివిజన్ పరిధి వార్డు కార్యాలయాల్లో ఇందిరమ్మ చీరల పంపిణి చేయనున్నారు. పొదపు సంఘాల మహిళల రుణాలు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) అధికారుల పర్యవేక్షణలో చీరల పంపిణి చేయనున్నారు. ఒక్కో మహిళా సంఘం పరిధిలో 8 నుంచి 13 వరకు సభ్యులు ఉన్నారు. ఒక్కో మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించే వ్యవహారాలను ఆయా డివిజన్ అర్బన్ కమ్యూనిటి ఆఫీసర్ నేతృత్వంలో రీసోర్స్ పర్సన్లకు అప్పగించారు.
ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం
ఒక్కో పొదుపు మహిళకు రెండేసి అందజేత