
భూములిచ్చేది లేదు
యాచారం: ప్రాణాలైనా అర్పిస్తాం కాని.. ఎట్టి పరిస్థితుల్లో భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి రైతులు తెగేసి చెప్పారు. పారిశ్రామిక పార్క్‌ల కోసం భూసేకరణకు సంబంధించి బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నోటిఫికేషన్‌లో ప్రకటించినట్టు గ్రామంలోని పలు సర్వేనంబర్లలో 821.11 ఎకరాలను ప్రభుత్వ అవసరాల కోసం సేకరిస్తున్నట్టు చెప్పారు. దీంతో రైతులు ఆ భూములనే నమ్ముకుని బతుకుతున్నాం, మీరు తీసుకుంటే ఎట్లా బతకాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఐ నందీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా సభ జరగని వ్వాలని రైతులకు నచ్చజెప్పారు. 19, 68, 127 అసైన్డ్ సర్వేనంబర్లలో రెవెన్యూ అధికారుల సహకారంతో ఎంతో మంది నకిలీలు సర్టిఫికెట్లు పొంది, పట్టాదారు, పాసుపుస్తకాలు తీసుకున్నారని.. నిజమైన అసైన్డ్ రైతులకు నేటికీ పట్టాదారు, పాసుపుస్తకాలు రాలేదని బాధిత రైతులు దృష్టికి తెచ్చారు. భూసేకరణలో సమగ్ర విచారణ చేసి, నకిలీలను తీసేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన యాచారంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెజార్టీ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారని, అంగీకార పత్రాలు కూడా ఇచ్చారని వెల్లడించారు. వారం రోజుల్లో అసైన్డ్, పట్టా భూములకు ఏ విధంగా పరిహారం చెల్లించాలనే విషయమై తెలియజేస్తామని చెప్పారు.
తిమ్మాయిపల్లి రైతులతో సమావేశం
కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో భాగంగా ప్రభుత్వం తిమ్మాయిపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 9లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను టీజీఐఐసీ ద్వారా సేకరించే పనులు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో రెండు, మూడు పర్యాయాలు రైతులతో సమావేశమైన అధికారులు తాజాగా కందుకూరు మండల పరిషత్ సమావేశ హాల్‌లో బుధవారం మరోసారి సమావేశమయ్యారు. ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎకరాకు భూసేకరణ చట్టం కంటే అదనంగా రూ.51,51,906 చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు అదనంగా 121 గజాల ప్లాటును కేటాయిస్తామని చెప్పారు. రైతులు సహకరించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ గోపాల్ ఉన్నారు.
తేల్చి చెప్పిన మొండిగౌరెల్లి రైతులు

భూములిచ్చేది లేదు