
మొగులయ్యకు న్యాయం చేస్తాం
ఇబ్రహీంపట్నం రూరల్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలంలో కొంత మంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని మొగులయ్యకు ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విన్నవించడంతో ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి న్యాయం చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలిసి మొగులయ్య కలెక్టర్‌ను కలిశారు. స్థలం కేటాయింపునకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. స్థలం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను న్యాయపరంగా ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు వేసిన కోర్టు కేసు విషయంలో ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డిని ఆదేశించారు. ఎలాంటి ఆందోళన చెందొద్దని మొగులయ్యకు సూచించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి