
లక్ష గాంధీ విగ్రహాల సేకరణ షురూ
హయత్‌నగర్: మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో భాగంగా పలు రూపాల్లో ఉన్న లక్ష గాంధీ విగ్రహాలను సేకరించే కార్యక్రమం చేపట్టినట్టు గ్లోబల్ ఫ్యామిలీ వ్యవస్థాపక అధ్యక్షుడు గున్న రాజేందర్‌రెడ్డి అన్నారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని కుంట్లూర్‌లో గల గాందేయన్ కళాశాలలో శుక్రవారం లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష గాంధీ విగ్రహాలను సేకరించి ప్రజలకు అందించడం ఒక ఉద్యమంగా చేపట్టామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు గాంధీ మార్గమే ఉత్తమమైనదని పేర్కొన్నారు. గాంధీ తత్వాన్ని యువతకు, రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా విగ్రహాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలతో గాంధీ విగ్రహాల సేకరణ అనే అక్షరమాలను ప్రదర్శించారు. సంస్థ ఉపాధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ గాంధారి ప్రభాకర్ పాల్గొన్నారు.