
తడిసిమోపెడు!
యాచారం మండలంలోని జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. ఓ ప్రధాన పార్టీకి చెందిన నేత జెడ్పీటీసీ టికెట్ తనకే వస్తుందని ఆశించాడు. గెలవాలంటే కనీసం రూ.కోటిన్నర ఖర్చవుతుందని మద్దతుదారులు తెలిపారు. డబ్బు కోసం తెలిసిన వాళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో స్నేహితుడి ద్వారా నగరంలోని ఓ వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు. డబ్బులిస్తా.. కానీ రూ.వందకు రూ.5 వడ్డీ అని తెలిపాడు. సరేనని తన కుటుంబ సభ్యుల పేరు మీద నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న రూ.3 కోట్లకు పైగా విలువచేసే ఐదెకరాల వ్యవసాయ భూమిని ఆరు నెలల చెల్లింపు గడువుతో వడ్డీ వ్యాపారికి రిజిస్ట్రేషన్ చేశాడు. తీరా హైకోర్టు స్టే విధించడంతో లబోదిబోమంటున్నాడు.
యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావహులంతా చాలావరకు వడ్డీ వ్యాపారుల తలుపులే తట్టారు. పోటీదారులకంటే అ్ఙధనశ్రీంగా ఖర్చు చేస్తేనే గెలుస్తామనే ఉద్దేశంతో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్లను రిజిస్ట్రేషన్లు చేసి మరీ అప్పులు తెచ్చుకున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన మరుసటి రోజు నుంచే డబ్బుల జమపై దృష్టి పెట్టారు. జెడ్పీటీసీకి పోటీ చేయాలంటే రూ.కోటిన్నర, ఎంపీపీ కావాలంటే రూ.2 కోట్లకు పైగా, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడిగా గెలవాలంటే కనీసం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు, మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాలైతే రూ.కోటికిపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటవుతున్న యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లు, మంచాల మండలాల్లోని అనేక గ్రామాల్లో గెలవాలంటే అత్యధికంగా ఖర్చు చేస్తేనే సాధ్యమని అందినకాడికి అప్పులు చేశారు.
డబ్బులిస్తాం.. మళ్లీ రిజిస్ట్రేషన్లు చేస్తారా?
ఎన్నికలకు హైకోర్ట్ బ్రేక్ వేయడంతో ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ మళ్లీ నోటిఫికేషన్ వచ్చినా ఇవే రిజర్వేషన్లు ఉంటాయో.. లేదో తెలియదు. ఈ క్రమంలో అప్పులు తెచ్చుకున్న ఆశావహులంతా వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ‘మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం.. మా వ్యవసాయ భూములు, ప్లాట్లు మళ్లీ మా పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయండి’ అంటూ ప్రాధేయపడుతున్నారు. మధ్యవర్తులను సంప్రదించి కమీషన్లు ఇస్తాం.. వడ్డీ వ్యాపారులను ఒప్పించి తిరిగి తమ ఆస్తులు తమ పేర్లపై నమోదు చేయించండి అంటూ బతిమిలాడుతున్నారు. వడ్డీ వ్యాపారులు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేస్తాం కానీ ఒప్పందం ప్రకారం ఆరు నెలల వడ్డీ చెల్లించండని తెగేసి చెబుతున్నారు. దీంతో వడ్డీలకు తెచ్చిన డబ్బును తిరిగి వ్యాపారులకు ఇవ్వలేక.. ఇంట్లో ఉంచుకోలేక ఆశావహులకు కంటికి కునుకు లేకుండాపోతోంది.
స్థానిక ఎన్నికలకు ఆశావహుల పోటీ
రిజర్వేషన్లు అనుకూలించడంతో పలువురి ఆసక్తి
అప్పులు చేసి మరీ సమరానికి సన్నద్ధం
హైకోర్ట్ బ్రేక్‌తో ఒక్కసారిగా కలవరం
తెచ్చిన రుణాలపై ఆందోళన