
అక్రమ రవాణాకు అడ్డేది!
● పట్టపగలే ఫ్యాక్టరీలకు కలప తరలింపు
● అడ్డగోలుగా వృక్షాలు నరికేస్తున్న అక్రమార్కులు
● లారీకి రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు అధికారులపై ఆరోపణలు
ఇబ్రహీంపట్నం రూరల్: పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ సందపను కాపాడాల్సిన అధికారులు అక్రమంగా కలప రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమార్కులకు అధికారుల అండదండలు
ఇబ్రహీంపట్నం ఫారెస్టు రేంజ్ పరిధిలో వృక్షాలు అడ్డగోలుగా నరికి వేస్తున్నారు. వేప, తుమ్మ, మామిడి, చింత, టేకు తేడా లేకుంటా కొట్టి వేస్తున్నారు. రేంజ్ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కంపెనీలున్నాయి. వీటి బాయిలర్ కోసం కలప విరివిగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం అటవీ శాఖ అనుమతి తీసుకుని పనికిరాని చెట్లనుంచి వచ్చే కలప మాత్రమే వినియోగించాలి. రియల్‌ఎస్టేట్ వెంచర్ల పేరిట రియల్ వ్యాపారులు, బాయిలర్‌ల కోసం కంపెనీల యాజమాన్యాలు వృక్షాలను అడ్డగోలుగా నరికేస్తున్నారు. అధికారులు సైతం వారిచ్చే నజరానాలు పుచ్చుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. అక్రమార్కులకు అధికారుల అండదండలుండడంతో పట్టపగలే యథేచ్చగా కలప తరలిస్తున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, మంగళ్‌పల్లి ప్రాంతాల నుంచి లారీల కొద్దీ కలప రవాణా చేస్తున్నారు. ఒక్కో లారీకి రూ.5వేలు ఇచ్చుకుంటే ఎంత కలప నరికినా పట్టించుకునే వారే లేరంటూ బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఓ అధికారిని కలిస్తే పని జరిగినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అక్రమంగా తరలిస్తున్న కలప
అటవీ సంపద రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తుంటే.. అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా కలప రవాణా చేస్తున్నారు. అడవుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం నిర్వహిస్తుంటే అక్రమార్కులు చెట్లను నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
కలప అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. నా దృషిటికి వస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటాం. కలప రవాణా చేస్తే చర్యలు తప్పవు. చెట్లను నరకడం నేరం. క్షేత్ర స్థాయి అధికారులు సైతం కఠినంగా వ్యవహరించాలి. – శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం రేంజ్ అధికారి
చర్యలు తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం ప్రాంతాల నుంచి భారీగా కలప తరలిస్తున్నారు. అధికారులకు తెలిసే తతంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలి. లేకుంటే పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. – జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు