
చికిత్స పొందుతూ మహిళ మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
● ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
మహేశ్వరం: చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన మారమోని శివకుమార్ భార్య స్వాతి (26) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మండల కేంద్రంలోని మ్యాక్స్‌వెల్ ఆస్పత్రిలో 20 రోజుల క్రితం చేరింది. వైద్యులు ఆపరేషన్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఆమెకు డెంగీ జ్వరం వచ్చింది. అదే ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు ఏమీకాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించి మందులు రాసిచ్చి పంపించారు. తర్వాత రక్తకణాలు తగ్గి బలహీనం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయని తాము ఏమీ చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబ సభ్యులు మహేశ్వరం గేటు వద్ద ఉన్న మరో ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించిందని ధ్రువీకరించారు. మ్యాక్స్‌వెల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య స్వాతి మృతి చెందిందని భర్త శివకుమార్ ఆరోపించారు. వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా రక్తకణాలు తగ్గిపోయి, గుండె పోటు వచ్చి చనిపోయిందన్నారు. మహేశ్వరం పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.