
నగదుపై నజర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థలకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు తరలింపుపై దృష్టి సారించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయాలని భావించే ఆశావహులు, వారి బంధు మిత్రులపై నిఘా ఉంచింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందు న వారి రాక పోకలు సహా బ్యాంక్ అకౌంట్లపైనా దృష్టి పెట్టింది. తనిఖీల్లో రూ.50 వేలకు మించి నగదు దొరికితే పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. జిల్లా, మండల, గ్రామ సరిహద్దులు, ప్రధాన రహదారులపై పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తనిఖీ విభాగాలకు మండల తహసీల్దార్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. సరైన ఆధారాలు(వస్తు కొనుగోలు/అమ్మకాలకు సంబంధించిన రసీదులు) చూపిస్తే సరి.. లేదంటే ఆయా నగదును స్వాధీనం చేసుకోనుంది. పెద్ద మొత్తంలో మద్యం కొనుగోళ్లు, సరఫరా, బంగారం, వెండి వస్తువులు, చీరలు, ఇతర వస్తు కొనుగోళ్లపైనా నిఘా పెంచారు. ఇప్పటికే ఆయా దుకాణాల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
12 విభాగాలకు నోడల్ అధికారులు
21 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 230 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులకు మలి విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. పోలింగ్, కౌంటింగ్ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందుకు ఎన్నికల కమిషన్ 12 విభాగాలను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కో నోడల్ అధికారిని నియమించింది. పోలింగ్‌కు ఎంత మంది సిబ్బంది అవసరం? ఎక్కడ విధులు నిర్వర్తించాలి? ఓటింగ్‌లో ఎవరు పాల్గొనాలి? కౌంటింగ్‌లో ఎవరు పాల్గొనాలి? తదితర పనుల పర్యవేక్షణకు మానవవనరుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ హెచ్‌ఆర్ విభాగానికి డీసీఐ జీఎం ఎం.శ్రీలక్ష్మిని నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. బ్యాలెట్ బాక్సులు ఎన్ని అవసరం? ఎలా సమకూర్చాలి? పోలింగ్ కేంద్రానికి ఎలా తరలించాలి? అటు నుంచి స్ట్రాంగ్‌రూమ్‌కు.. ఆ తర్వాత కౌటింగ్ హాల్‌కు ఎలా తరలించాలి? వంటి పర్యవేక్షణకు బ్యాలెట్ బాక్సుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. డీపీఓ సురేశ్ మోహన్‌ను దీనికి నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బందిని పోలింగ్ బూత్‌లకు తరలింపు, అటు నుంచి మళ్లీ వారి గమ్యస్థానాల కు చేర్చేందుకు వాహనాలను పెద్ద సంఖ్యలో సమకూర్చాల్సి ఉంది. ఇందుకు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ సుభాశ్ చందర్‌రెడ్డిని నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. సిబ్బందికి శిక్షణకు డీఈ ఓ సుశీందర్‌రావు, మెటీరియల్ మేనేజ్‌మెంట్ విభాగానికి శ్రీరామ్ రాములును నోడల్ ఆఫీసర్లుగా నియమించింది.
అభ్యర్థుల ఖర్చులపై నిఘా
ఎన్నికలప్రచారంలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుంటారు. వాహనాల ర్యాలీలు నిర్వహిస్తుంటారు. గ్రామాల పర్యటన కు వాహనాల వినియోగం, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు సమకూర్చుకుంటారు.వీటితో పాటు వెంట తిరిగే కార్యకర్తల కు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మద్యం, మాంసాహా రాలను సమకూర్చుతుంటారు.లెక్కకు మించి ఖర్చు చేసే వారి పై గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ఎంసీసీ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్‌గా సీపీఓ సౌమ్యను,ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ విభాగం నోడల్ ఆఫీసర్‌గా జిల్లా ఆడిట్ ఆఫీసర్ ఎన్. వెంకట్‌ను, ఎన్నికల పరిశీలకులుగా ఎస్‌ఎల్‌ఆర్ ఏడీ కె.శ్రీనివాస్‌ను, ఫిర్యాదుల స్వీకరణ విభాగం నోడల్ ఆఫీసర్‌గా డీఆర్‌డీఓ పీడీ ఎల్.శ్రీలతను, ప్రచార విభాగం నోడల్ ఆఫీసర్‌గా డీపీఆర్‌ఓ పీసీ వెంకటేశ్‌ను, రిటర్న్స్ విభాగం నోడల్ ఆఫీసర్‌గా బి.రంగారావును నియమించింది. వీరంతా కలెక్టరేట్ కేంద్రంగా ఆయా పనులను పర్యవేక్షిస్తుంటారు.