
పల్లె పోరు.. విందుల జోరు!
షాద్‌నగర్: అసలే దసరా సమయం.. ఆపై ఎన్నికల సమరం.. ఇంకేముంది పల్లెల్లో విందుల సందడి మొదలైంది. నాయకులను, ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానాలు కూడా గెలుపు గుర్రాల వేట మొదలు పెట్టడంతో రాజకీయం రసవత్తంగా మారింది.
మచ్చిక చేసుకునేందుకు..
ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాలనుకునే వారు.. సర్పంచ్ పదవి కోసం పార్టీలతో సంబంధం లేకుండా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న వారిలో కొందరు ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టారు. ఇందులో రిజర్వేషన్లు అనుకూలించని నాయకులు ఆవేదనలో ఉండగా అనుకూలంగా వచ్చిన వారు అటు పార్టీల నాయకులను, ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రాదేశిక, పంచాయతీ సమరానికి నగారా మోగిన నేపథ్యంలో పల్లెలో విందుల జోరు కొనసాగుతోంది.
విందు రాజకీయాలు
గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎలక్షన్ల హడావుడి మొదలైంది. దీంతో బరిలో ఉండాలనుకుంటున్న నాయకులు ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్ల పు ణ్యమా అని కొన్ని చోట్ల టికెట్ పోరు లేకపోగా, మ రికొన్ని చోట్ల తీవ్ర పోటీ నెలకొంది. దీంతో మందు, విందులతో సత్తాచాటేందుకు పోటీదారులు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా వీరి జేబులు ఖాళీ చేసేందుకు కొంత మంది ఓటర్లు ఇప్పటికే నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సందిగ్ధంలో నేతలు
తాజాగా బీసీలకు ప్రభుత్వం కల్పించిన 42శాతం రిజర్వేషన్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. దీంతో రిజర్వేషన్లపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై వారం రోజుల్లో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందోననే భయం ఆశావహులను వెంటాడుతోంది. ప్రధానంగా బీసీ రిజర్వుడు స్ధానాలు 42శాతం కొనసాగుతాయా..? ఏమైనా మార్పులు ఉంటాయా అనే అంశంపైనే ఉత్కంఠ సాగుతోంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదనే చర్చ కూడా సాగుతోంది.
ముందే కిక్కు
ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో మద్యం, మాంసం దుకాణాలు తెరుచుకునే అవకాశం లేకుండాపోయింది. ఈక్రమంలో తమ మద్దతుదారులు, అనుచరులను మత్తులో ముంచేందుకు నాయకులు ముందుగానే మద్యం కొనుగోలు చేశారు. గత రెండు రోజులుగా మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున స్టాక్ విక్రయించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.