
‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ
డీఎస్‌పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భిక్షపతి
షాద్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్‌పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భిక్షపతి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి కమ్యూనిటీ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజానికి కొత్త నాయకత్వం అవసరముందని.. అది విశారదన్ మహారాజ్ నాయకత్వంలోని డీఎస్‌పీతోనే సాధ్యమన్నారు. పార్టీ నాయకులు అభ్యర్థుల గెలుపనకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు అహ్మద్‌పాషా, రాకేశ్, మల్లేశ్, నర్సింహ, దాసు, రాములు, పెంటయ్య, భవానీ శేఖర్, రవీంద్ర, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
సన్మానం
పహాడీషరీఫ్: గృహిణులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ.. వారికి న్యాయం చేసేందుకు అండగా నిలుస్తున్న ఫాతిమా మహిళా మండలి అధ్యుక్షురాలు మస్రత్ ఫాతిమాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండలి కార్యదర్శి అబ్దుల్ బషీర్ అల్ ఖురేషీ, సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖాజా పాషాను హెచ్‌ఆర్‌సీ ప్రతినిధి మహ్మద్ ఫెరోజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. ముస్లిం మైనార్టీలకు గృహహింసకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. వారికి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమన్నారు.
ట్రక్కు–బైక్ ఢీకొని వ్యక్తి మృతి
మొయినాబాద్‌రూరల్: ట్రక్కు బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన జోగు సురేందర్(43), మొయినాబాద్ మండలం మెడిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. టీఎస్07 జేక్యూ0572 ద్విచక్ర వాహనపై తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరన్నపేట్ సమీపంలో.. ఎదురుగా వస్తున్న టాటా ట్రక్ ఏపీ39 యూఎక్స్2658 ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ తలకు తీవ్రగాయాలు అయి.. అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఉస్మానియాకు తరలించారు.

‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ

‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ