
బాకీ కార్డే ప్రచార అస్త్రం
చేవెళ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌స్‌కు కాంగ్రెస్ ఇచ్చిన హామీల బాకీ కార్డు వజ్రాయుధమని.. ఆ కార్డుతోనే ఎన్నికల ప్రచారం చేపట్టి విజయం సాధిస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ముడిమ్యాలలో పార్టీ నాయకుడు గోనె కరుణాకర్‌రెడ్డి ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఒకే సారి పెట్టి గందరగోళం సృష్టించారన్నారు. అశావాహులంతా కలిసి కూర్చుని గెలిచే అవకాశం ఉన్నవారిని అభ్యర్థిగా ఎంపిక చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డును చూపిస్తే చాలు బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లును చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క కోటీశ్వరాలును చూపాలని ఎద్దేవా చేశారు. ఒక్క యూరియా బస్తాకోసం మహిళలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర పార్టీకు చెందిన వారితో కలిసి తిరగడం, మాట్లాడం మానేయాలని.. ఇది ప్రజల్లోకి చెడు సంకేతాలు తీసుకెళ్తుందన్నారు. తాను భౌతికంగా మాత్రమే వేరే చోట ఉన్నానని.. మనస్సు మొత్తం చేవెళ్ల చుట్టే తిరుగుతుందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ రిజర్వేషన్ వచ్చిన నాలుగు జెడ్పీటీసీ స్థానాలు చేవెళ్ల, మహేశ్వరం పరిధిలోనే ఉన్నాయని వీటిని గెలిపించి కేసీఆర్‌కు చైర్మన్ పీఠం గిఫ్ట్‌గా ఇద్దామన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు ఆంజనేయులు, కనీస వేతన బోర్డు మాజీ చైర్మన్ నారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ శివప్రసాద్, సీనియర్ నాయకులు కరుణాకర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.