
ఇబ్బంది పెట్టేందుకే సర్కార్ కుట్ర
యాచారం: సర్కార్ కావాలనే ఇబ్బందులకు గురి చేస్తోందని ఫార్మాసిటీ భూబాధిత రైతులు అవేదన వ్యక్తం చేశారు. కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాలకు చెందిన 150 మందికి పైగా రైతులకు పక్షం రోజుల క్రితం అథారిటీ నోటీసులు ఇచ్చిన వివషయం విదితమే. రైతులకు సమాచారం లేకుండానే పట్టా భూముల పరిహారాన్ని గత బీఆర్‌ఎస్ సర్కార్ అథారిటీలో జమ చేసింది. ఈ పరిహారం తీసుకునే విషయంలో అభ్యంతరాలు తెలపాలని అథారిటీ నుంచి రైతులకు నోటీసులు అందాయి. దీంతో అయా గ్రామా లకు చెందిన రైతులు బుధవారం నాంపల్లిలోని అథారిటీ కోర్టుకు హాజరయ్యారు. నోటీసుల్లో తేదీ ప్రకారం ఆథారిటీ వద్దకు వెళ్లగా జడ్జి సెలవులో ఉన్నారని అధికారులు సైతం ఈ రోజు రారని సిబ్బంది రైతులకు తెలియజేశారు. నోటీసులు అందిన తేదీ ప్రకారం అథారిటీ వద్దకు వచ్చామని జడ్జి సెలవు తీసుకుంటే.. అధికారులు ఎవరూ రాకపోతే తమ అభ్యంతరాలు, బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలని అవేదన వ్యక్తం చేశారు. ముందే సమాచారం ఇస్తే రాకపోయే వారం కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అథారిటీ ఎదుట నోటీసులు చూపుతూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
రైతులను కోదండరాం సంఘీభావం
నాంపల్లిలోని అథారిటీ వద్దకు వచ్చిన రైతులతో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఆరు నెలలుగా ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో సర్కార్ పోలీసుల బందోబస్తు నడుమ ఫెన్సింగ్ వేస్తోందని.. బెదిరింపులకు పాల్పడుతోందని వివరించారు. ఇందుకు స్పందించిన కోదండరాం వెంటనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడి సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు.
ఫార్మాసిటీ భూ బాధితులు