
శాంతిభద్రతలతో పాటు సంక్షేమానికీ ప్రాధాన్యం
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ ఆవిష్కృతం కానుందని కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనర్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నిరోధంతో పాటు ప్రజా సంక్షేమానికీ పెద్దపీట వేస్తూ విధానాలు రూపొందిచనున్నామని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (టీజీఐసీసీసీ) మంగళవారం నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రస్తుత విధానాలే కొనసాగింపు..
గడచిన కొన్నేళ్లుగా నగర పోలీసింగ్‌లో అనేక సంస్కరణలు వచ్చాయి. అమలులో ఉన్న విధానాలు కొనసాగిస్తూనే అవసరమైన స్థాయిలో కొత్తవి అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రజా సంక్షేమ పోలీసింగ్‌లో భాగంగా నగర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఆహార కల్తీని నిరోధించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఏయే సరుకులు ఎలా కల్తీ అవుతున్నాయో గుర్తించడానికి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు రూపమిస్తాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. ఈ కేసుల్లో నిందితులతో డేటా బ్యాంక్ ఏర్పాటు చేసి ఇతర విభాగాలతో సమన్వయంతో పని చేస్తాం.
సైబర్ నేరాలపై పోరు..
ఎప్పటికప్పుడు పంథా మారుస్తూ నానాటికీ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తాం. ఇటీవల కాలంలో వృద్ధులే ఎక్కువగా టార్గెట్‌గా మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోని వృద్ధులపై దృష్టి పెట్టాలి. పోలీసు విభాగానికి దూరంగా ఉన్నా బెట్టింగ్ యాప్స్‌పై ఇప్పటికే ‘హ్యాష్‌ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో ఉద్యమం చేశా. ఫలితంగానే వాటిని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మల్టీ లెవల్ మార్కెటింగ్స్, రియల్ ఎస్టేట్ మోసాలు, భూ కబ్జాలపై కఠిన వైఖరి ఉంటుంది. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నేరాలకు పాల్పడే వారు తమ ఇంట్లో ఉన్న తల్లి, సోదరి, భార్యల్ని గుర్తు చేసుకుని, మహిళల్ని గౌరవించాలి.
ప్రతి ఒక్కరి ‘ఫ్యామిలీ టైమ్’ పెంచుతాం...
నగరంలో నానాటికీ వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్యలతో వాహనచోదకులు ఎక్కువ సమయం రోడ్లుపై ఉండాల్సి వస్తోంది. ఈ ప్రభావంతో వారు కాలుష్యం బారినపడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కుటుంబాలతో వారు గడిపే సమయం కూడా తగ్గిపోతోంది. రహదారులపై వాహనాల సరాసరి వేగం పెంచడంతో పాటు కాలుష్యం తగ్గించి, నగర వాసులు తమ కుటుంబాలతో గడపడానికి ఎక్కువ సమయం మిగిలేలా చేస్తాం. డ్రంక్ డ్రైవింగ్ అనేది రోడ్ టెర్రరిజం. డ్రంక్ డ్రైవర్లు సూసైడ్ బాంబర్లు. వీరి వల్ల ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు. కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. పోలీసింగ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు వినియోగిస్తాం.
పెద్దల్ని వదిలేస్తే సీనియర్ సిటిజన్స్ యాక్ట్..
ఇటీవల కాలంలో అనేక మంది వృద్ధులైన తమ కుటుంబీకుల్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి వారిపై రెస్క్యూ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇకపై ఈ పని ఎవరైనా చేస్తే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. నగరంలోని ప్రతి భవనంపైనా ఓ సీసీ కెమెరా ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిని ఆడిటింగ్ చేయడం ద్వారా అన్నీ పని చేసేలా చర్యలు తీసుకుంటాం. అహర్నిశలు కష్టపడే పోలీసు సిబ్బంది సంక్షేమానికీ పెద్దపీట వేస్తాం. ఉత్తమ పనితీరును కనబరిచిన ఉన్నతాధికారి నుంచి హోంగార్డు వరకు అందరికీ రివార్డులు అందిస్తాం. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. నేరగాళ్లకు జ్యురిస్‌డిక్షన్ ఉండదు. ఈ నేపథ్యంలోనూ మూడు కమిషనరేట్‌లు సమన్వయంతో పని చేయనున్నాయి. సోషల్‌మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవు.
మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి..
మైనర్లు చేసే నేరాలు పెరిగిపోతున్నాయి. వాళ్లు ఆ పని చేసే వరకు తల్లిదండ్రులకూ వారి ప్రవర్తన తెలియట్లేదు. స్మార్ట్‌ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరూ వారి బిడ్డల కార్యకలాపాలు, ఆన్‌లైన్ స్నేహాలు, క్రయవిక్రయాలపై కన్నేసి ఉంచాలి. టీజీఐసీసీసీలోని కమిషనరేట్, బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్, పాతబస్తీలోని కొత్వాల్ హౌస్‌ల నుంచి పని చేస్తా. ఎప్పడు ఎక్కడ ఉంటాననే ప్రణాళికను త్వరలోనే విడుదల చేస్తా. ప్రతి పౌరుడు ఓ పోలీసు లాంటి వాడే. తమ చుట్టూ ఉన్న అసాంఘికశక్తులు, కార్యకలాపాలపై కన్నేసి ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా, సహాయం కావాలన్నా అన్ని స్థాయిల్లోని అధికారులం నిర్విరామంగా అందుబాటులో ఉంటాం. హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ వింగ్‌కు (హెచ్–న్యూ) సిబ్బంది, వనరులు కేటాయించి దాన్ని బలోపేతం చేస్తాం.