
కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు
నాగార్జునసాగర్: స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్, జ్ఞానేందర్, సుమన్, మణికంఠరెడ్డి, వెంకటేష్, చాణక్య (16)స్నేహితులు. వీరంతా వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరంతా కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టును చూడటానికి మంగళవారం రెండు బైక్‌లపై వచ్చారు. అందరూ కలిసి నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఫొటోలు తీసుకున్నారు. అనంతరం కొత్త బ్రిడ్జి సమీపంలో చింతలపాలెం వెళ్లే దారి వెంట ఉన్న ఆంజనేయ పుష్కర ఘాట్‌లోకి దిగి స్నానాలు చేస్తుండగా.. చాణక్య నీటి ఉధృతికి కృష్ణా నదిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..వారు గజ ఈతగాళ్లతో కృష్ణా నది తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించలేదు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
కుల్కచర్ల: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో సీసీ కెమెరాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా దుకాణదారులు ఏర్పాటుచేయించుకుంటే నేరాలు అదుపుచేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, స్థానిక నాయకులు వెంకట్రాములు, రాజశేఖర్, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.