
స్థానికం..సందిగ్ధం
జిల్లా వివరాలు
ఖర్చు చేశాక.. రాత మారితే!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే దసరా పండుగ.. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. దీనికి తోడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అయోమయం.. వెరసి ఆశావహుల గుండెల్లో దడపుట్టిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే ఇదే అంశంపై హైకోర్టులో కేసు కొనసాగుతోంది. నవంబర్ 8న ఈ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా స్థానాలకు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు.. ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తీరా ఖర్చు చేసిన తర్వాత రిజర్వేషన్లు మారితే.. తమ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని తొలిచేస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా. .రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు తర్వాతే ముందుకు వెళ్లాలని మెజార్టీ ఆశావహులు భావిస్తున్నట్లు తెలిసింది. దావత్‌లు, ఇతర ఖర్చుల విషయంలో అప్పటి వరకు వేచి చూడడమే ఉత్తమమనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
దడపుట్టిస్తున్న దసరా
ఎన్నికల కమిషన్ ఎంత చెప్పినా.. నిబంధనలను కఠినంగా అమలు చేసినా.. ఫ్లెక్సీలు, పత్రిక ప్రకటనల రూపంలో హెచ్చరికలు జారీ చేసినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓటుకు నోటు కామనే. పోటీలో ఉండాలని భావించే ఆశావహుల నుంచి ఓటర్లు ఎంతో కొంత ఆశిస్తూనే ఉంటారు. నామినేషన్ మొదలు.. ఇంటింటి ప్రచారంలో భాగంగా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలకు ఎంతో కొంత ఖర్చు చేయాల్సిందే. ప్రచారంలో భాగంగా రోజూ వెంట వచ్చే కార్యకర్తలు, ముఖ్య నాయకులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం సరఫరా చేయాల్సిందే. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి కనీసం రూ.కోటి, ఎంపీపీ పదవిని ఆశించే అభ్యర్థి కనీసం రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఈ నేపథ్యంలో మామూళ్లు ఇచ్చిపుచ్చుకోవడం సహజం. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కొంత మంది ఆశావహుల నుంచి మద్యం ఆశిస్తుంటారు. అసలే ఎన్నికల సమయం.. అడిగిన వాళ్లను కాదంటే తమకు ఓటు వేయబోరనే భయం అభ్యర్థులను వెంటాడుతుంటోంది. తమ వద్ద లేకపోయినా..అప్పు చేసైనా ఆయా ఓటర్ల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ ఖర్చులను భరించే శక్తిలేని వాళ్లు.. ఏదో ఓ సాకుతో ఊరు నుంచి ఇతర ప్రాంతాలకు కన్పించకుండా వెళ్లిపోతున్నారు. మరికొంతమంది ఏకంగా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో ఉండటంతో అనిశ్చితి
9వ తేదీ తర్వాతే స్పీడ్ పెంచే యోచనలో రేసుగుర్రాలు
అప్పటి వరకు వేచి చూస్తేనే మంచిదనే ధోరణిలో ఆశావహులు
తీర్పు భిన్నంగా వస్తే..
జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలుండగా, 230 ఎంపీటీసీ స్థానాలు, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులు ఉన్నాయి. పార్టీ గుర్తుపై నిర్వహించే ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి అధికార కాంగ్రెస్ నుంచి ఒకరు, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచే అవకాశం ఉంది. వీరితో పాటు మరో నలుగురు స్వతంత్రులు పోటీ చేయనున్నారు. ఇలా ఒక్కోస్థానం నుంచి కనీసం పది మంది వదరకు పోటీలో ఉండనున్నారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలకు 200–210 మంది వరకు, ఎంపీటీసీ స్థానాలకు 2,300 మంది వరకు పోటీ చేయనున్నారు. ఇక పార్టీ గుర్తులకు అతీతంగా నిర్వహించే ఒక్కో సర్పంచ్ స్థానానికి కనీసం ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థుల చొప్పున రెండు వేల మంది వరకు పోటీలో ఉండనున్నారు. ఒక్కో వార్డుకు ఇద్దరు ముగ్గురు చొప్పున పది వేల మంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే రాజ్యాంగ సూత్రానికి విరుద్ధంగా జీఓ జారీ చేయడం, కొంత మంది ఇప్పటికే ఆ అంశంపై కోర్టుకు వెళ్లడం, నవంబర్ 8న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించడం తెలిసిందే. ప్రకటించిన రిజర్వేషన్లకు భిన్నంగా తీర్పు వస్తే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.
జెడ్పీటీసీ స్థానాలు 21
ఎంపీటీసీ స్థానాలు 230
గ్రామ పంచాయతీలు 526
వార్డులు 4,668