
నిధుల స్వాహాపై చర్యలు నిల్
యాచారం: స్వయం సహాయక సంఘాలపై మహిళలు విశ్వాసం కోల్పోతున్నారు. తాము పొదుపు చేసే డబ్బులు, బ్యాంకుల నుంచి అందే రుణాల విషయంలో రక్షణ లేక.. భారీ అవకతవకలు జరిగినా పట్టించుకునే వారే లేకపోవడంతో మహిళలు సంఘాల నుంచి విత్‌డ్రా అయ్యే యోచనలో ఉన్నారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకునే విషయంలో డీఆర్‌డీఓ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మహిళల్లో అభద్రతాభావం నెలకొంది. మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామంలో ఓ వీబీకే(విలేజ్ బుక్ కీపర్), బ్యాంకు సిబ్బంది కలిసి దాదాపు 20 స్వయం సహాయక సంఘాలకు దక్కాల్సిన రూ.కోటిన్నరకు పైగా నిధులు దుర్వినియోగం చేసి సంచలనంగా మారిన విషయం విదితమే. గ్రామానికి చెందిన మహిళలు స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, స్పందించిని ఎమ్మెల్యే వెంటనే డీఆర్‌డీఓ, బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. తొలుత హంగామా చేసి ఆ తర్వాత మిన్నకుండిపోయారు.
పక్షం రోజుల విచారణ చేసి..
చౌదర్‌పల్లి గ్రామంలోని 20కి పైగా స్వయం సహాయక సంఘాల్లో జరిగిన నిధుల స్వాహాపై డీఆర్‌డీఓ శ్రీలత ఆదేశాల మేరకు డీపీఎం యాదయ్య, లీలాకుమారి 15 రోజుల పాటు విచారణ చేశారు. గ్రామానికి చెందిన రికార్డులను ఆడిట్ సిబ్బంది శ్రీనివాస్, మధు క్షుణ్ణంగా పరిశీలించి.. ప్రతీ స్వయం సహాయక సంఘం పేరు మీద యాచారం ఎస్‌బీఐలో రూ.లక్షలాది రుణాలు పొందినట్లు, ఆ డబ్బును సంఘంలో సభ్యులుగా లేని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి మల్లించినట్లు గుర్తించారు. ఒక్కో సంఘంలో రూ.10 నుంచి రూ.15 లక్షలు బినామీ పేర్లపై బదిలీ అయినట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన మహిళలు స్వయంగా మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయానికి వచ్చి విచారణ అధికారులకు ఫిర్యాదులు చేశారు. విచారణ పూర్తి చేసి పక్షం రోజులు గడిచిపోయినా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో బోధపడడం లేదు.
మాఫీ.. లేదా రికవరీ చేయండి
నిధుల దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సంఘాల సభ్యులు అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఐకేపీ కార్యాలయం సిబ్బంది, ఎస్‌బీఐ అధికారులను కలిసినా ఎటువంటి సమాధానం లభించడం లేదు. రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని లేదంటే.. స్వాహా చేసిన అధికారుల నుంచి రికవరీ చేయాలని వేడుకుంటున్నారు. విచారణకు వచ్చిన డీఆర్‌డీఏ అధికారులు ఐకేపీ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఏ ఒక్క రోజు సంఘం సభ్యులను కలిసి దాఖలాలు లేవంటూ ఆరోపిస్తున్నారు. నిధుల దుర్వినియోగం సమయంలో యాచారం ఎస్‌బీఐ మేనేజర్, తాజాగా చౌదర్‌పల్లి ఐకేపీ సీసీ జంగయ్య సైతం బదిలీ అవ్వడంతో మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
యాచారం ఐకేపీ కార్యాలయం
రూ.కోటిన్నరకు పైగా గోల్‌మాల్ చేసిన వీబీకే, బ్యాంకు సిబ్బంది
నిత్యం ఐకేపీ, యాచారం ఎస్‌బీఐ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న చౌదర్‌పల్లి డ్వాక్రా సంఘాల మహిళలు
అభద్రతాభావంలో సభ్యులు
సభ్యత్వం రద్దు చేసుకునేయోచనలో మహిళలు