
ప్రశాంతంగా ఎన్నికలు!
పారదర్శకంగా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓటర్ల జాబితా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల గుర్తింపు, రిజర్వేషన్ల కేటాయింపు, ఎన్నికల షెడ్యూల్ విడుదల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నిల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ల స్వీకరణకు కేటాయించిన తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.
హోర్డింగ్‌లు తొలగించాల్సిందే
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ, ఓటింగ్ నిర్వహణ, లెక్కింపు వంటి అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని రాజకీయ నేతల ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ తదితర పబ్లిక్ ప్రదేశాల్లో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాల్లో 72 గంటల వ్యవధిలో తొలగించాలన్నారు. అంతకు ముందు రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్‌మోహన్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవుల యాదయ్య, నవీన్ కుమార్, జంగారెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి సత్తు వెంకటరమణ రెడ్డి, మిట్టు జగదీశ్వర్, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు, దేవేందర్‌రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం
అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
విలేకరుల సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి
ఫేజ్–1
నోటిఫికేషన్ అక్టోబర్ 9
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9– 11 వరకు
పోలింగ్ అక్టోబర్ 23
లెక్కింపు నవంబర్ 11
ఫేజ్–2
నోటిఫికేషన్ అక్టోబర్ 13
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 13– 15 వరకు
పోలింగ్ అక్టోబర్ 27
లెక్కింపు నవంబర్ 11
ఫేజ్–1
నోటిఫికేషన్ అక్టోబర్ 17
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 17– 19వరకు
పోలింగ్ అక్టోబర్ 31
ఫేజ్–2
నోటిఫికేషన్ అక్టోబర్ 21
నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21–23 వరకు
పోలింగ్ నవంబర్ 4
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలు
సర్పంచ్‌లకు ఇలా