
రైతు సంక్షేమమే ధ్యేయం
మాట్లాడుతున్న సత్తయ్య
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. రాగన్నగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 53వ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.4.5కోట్ల నికర లాభం సాధించిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. రైతులు పంట రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో కొహెడలో ఐదెకరాల్లో గోదాములు నిర్మించి నెలకు రూ.7.5లక్షల అద్దెవస్తుందని వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు నాబార్డు 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉత్తమ సంఘం అవార్డును సాధించామని గుర్తుచేశారు. స్టడీ టూర్ నిమిత్తం కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని అనేక సహకార సంఘాల ప్రతినిధులు, ఉద్యోగుల బృందం పరిశీలనకు వచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో ఆదిబట్లలో ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం డీసీసీబీ కార్యాలయ నిర్మాణానికి ఎకరం భూమిని కేటాయించిందన్నారు. త్వరలోనే ఈ స్థలంలో భవన నిర్మాణ పనులను చేపడతామన్నారు. అనంతరం సంఘం సెక్రటరీ వై.రాందాస్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో 2025 ఆగస్టు 31 వరకు జరిగిన లావాదేవీలు, జమ, ఖర్చులను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో పీఐసీ సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, కొండ్రు స్వప్న శ్రీనివాస్, చాపల యాదగిరి, కొత్త రాంరెడ్డి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాజీ చైర్మన్లు సంరెడ్డి బాల్‌రెడ్డి, కొంతం మల్లారెడ్డి, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ సత్తయ్య