
నెల రోజులుగా ఏం చేస్తున్నట్లు..?
మొయినాబాద్: రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడినా పట్టించుకోరా అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో నెల రోజులకుపైగా పెద్ద చెరువు అలుగు పారుతూ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. మంగళవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో కలిసి చిలుకూరు వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు. అదే సమయంలో మండల పరిధిలోని రెడ్డిపల్లిలో తన ఫాంహౌస్‌కు వెళ్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చిలుకూరులో ఆగారు. చెరువు అలుగు పారుతూ రోడ్డుపై గుంతల పడితే ఇలానే వదిలేస్తారా.? నెల రోజులుగా ఇలాగే ఉంది. వాహనాలు రాకపోకలకు తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలి కదా.. అసలు అధికారులు పనిచేస్తున్నారా.. లేదా..? నెల రోజులుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతున్నా ఏం చేస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. అలుగు నీరు వెళ్లేందుకు వీలుగా పైపులు వేసి తాత్కాలిక మరమ్మత్తులైనా చేపట్టాలి కదా అంటూ ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఆర్ అండ్ బీ ఎస్‌ఈ, ఇరిగేషన్ ఎస్‌ఈలకు ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే పైపులు వేసి వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే సమస్య ఎక్కువైందని స్థానికులు కోమటిరెడ్డికి వివరించారు. కుంటలు కబ్జా కావడంతోపాటు డ్రైనేజీ నీరంతా పెద్ద చెరువులోకి చేరడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను పరిశీలించిన వారిలో ఆర్ అండ్ బీ ఈఈ రవీందర్‌కుమార్, డీఈ అజయ్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ రేణుకాదేవి, డీఈ పరమేశ్వర్, ఏఈ ప్రియాంక, వర్క్‌ఇన్‌స్పెక్టర్ నర్సింహ, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి తదితరులు ఉన్నారు.
అధికారుల తీరుపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం