
వర్షాలు.. వరదలతో..
మొయినాబాద్, శంకర్‌పల్లి, శంషాబాద్ మండలాల్లో ముంచెత్తిన వరద దిగువన నీట మునిగిన పేదల ఇళ్లు, పంట పొలాలు శాపంగా అధికారుల సమన్వయ లోపం
సాక్షి, రంగారెడ్డి జిల్లా/మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన జంట జలాశయాలు ప్రమాదంలో పడ్డాయి. చుట్టూ పెద్ద గద్దలు వాలడం, ఆక్రమణలు జరగడం, పూడిక పేరుకుపోవడం, అధికారుల సమన్వయ లోపంతో జలాశయాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీ వరదలు రావడంతో నిర్వహణ లోపాలు బయట పడుతున్నాయి. పెద్దల ఫాంహౌస్‌ల్లోకి నీళ్లు వెళ్లకుండా వచ్చిననీళ్లు వచ్చినట్లే వదిలేయడంతో దిగువన పేదల ఇళ్లు మునిగాయి. జలాశయాల ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలు పంటపొలాలను ముంచెత్తాయి.
కబ్జాలను గుర్తించినా చర్యలు శూన్యం
నగర శివారుల్లో నిజాం కాలంలో హైదరాబాద్‌కు వరద ముప్పును తప్పించడంతోపాటు తాగునీటిని అందించేందుకు ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. దశాబ్దాల పాటు జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందుతోంది. కొన్నేళ్లుగా గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ పెద్దలు భూములు కొనుగోలు చేశారు. రాజకీయ, వ్యాపార, సినీ రంగాలతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం జలాశయాలను ఆనుకుని ఉన్న భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. కొందరు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ను సైతం ఆక్రమించి మట్టితో నింపి ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టారు. పదిహేనేళ్ల క్రితమే హెచ్‌ఎండీఏ, జలమండలి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో సర్వేలు చేసి సుమారు 600 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. హిమాయత్‌సాగర్ జలాశయం పరిధిలో 390 ఎకరాలు, గండిపేట జలాశయం పరిధిలో 210 ఎకరాల వరకు కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోలేదు. దీనికి తోడు వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూడిక తీయకపోవడంతో జలాశయాలు కుంచించుకుపోయాయి. మరోవైపు జలాశయాలకు వరద నీరు వచ్చే ఈసీ, మూసీ పరీవాహక ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. వాగులు, వంకలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల ప్రభావం భారీ వరదలతో పంటపొలాలపై పడింది. పరీవాహక ప్రాంతంలోని పంటలు నీటమునగడంతోపాటు పొలాలు కోతకు గురయ్యాయి.
అధికారుల సమన్వయ లోపం
జలాశయాల్లోకి రెండు రోజుల క్రితం వచ్చిన వరదను అధికారులు ముందుగానే అంచనా వేయలేకపోయారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరికలు జారీ చేసినా జల మండలి అధికారుల సమన్వయ లోపం మూసీ ఉగ్రరూపం దాల్చడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26, 27న వికారాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. 26న తెల్లవారుజాము నుంచే వికారాబాద్ జిల్లాలోని పరిగి, పూడూరు, వికారాబాద్, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్ మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని జిల్లేడ్ చౌదరిగూడ, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, మండలాల్లో భారీ వర్షా లు కురిసాయి. ఈసీ, మూసీ నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించి మొయినాబాద్, శంకర్‌పల్లి, శంషాబాద్ మండలాల్లోని వందల ఎకరాల్లో పంట పొలాలను ముంచెత్తాయి.ఎగువన కురిసిన వర్షాని ,భారీగా వస్తున్న వరదలను ముందుగానే అంచనా వేయడంలో జలమండలి అధికారులు విఫలమ య్యారు. జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పెరిగిన కొద్దీ దిగువకు ఔట్‌ఫ్లోను గంట గంటకూ పెంచుతూ వెళ్లారు. దీంతో మూసీ తన ఉగ్రరూపాన్ని చూపించి హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.
రెండు నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్పటి నుంచి జంట జలాశయాల్లోకి ఈసీ, మూసీ వాగుల ద్వారా వరద వస్తూనే ఉంది. నెల రోజుల క్రితమే జలాశయాలు నిండుకుండలను తలపించడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయాల చుట్టూ ఉన్న పెద్దల భూముల్లోకి బ్యాక్ వాటర్ వెళ్లకుండా జలాశయాల పూర్తిస్థాయి నీటి మట్టం కంటే ఒక అడుగు మేర తక్కువ ఉన్నప్పుడే నీటిని దిగువకు వదులుతున్నారు. నెల రోజుల నుంచి వచ్చిననీళ్లు వచ్చినట్లే మూసీలోకి వదులుతున్నారు.
జంట జలాశయాల చుట్టూ
వాలిన గద్దలు!
పెద్దల భూములు మునగకుండా.. వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు

వర్షాలు.. వరదలతో..