
స్థానిక నగారా
షెడ్యూల్ విడుదల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎప్పుడెప్పుడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తొలి విడతలో పార్టీ గుర్తులపై నిర్వహించే జిల్లా/మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, తర్వాత సర్పంచ్, వార్డులకు ఓటింగ్ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా, మన జిల్లాలో మాత్రం రెండు (ఫేజ్–2, ఫేజ్–3) విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఇదిలా ఉంటే ఆశించిన దానికి భిన్నంగా స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు కావడం, ఇప్పటి వరకు ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావించి ఆశావహులకు తీరా పోటీ చేసే అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసి నిరాశలో మునిగిపోయా. జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్‌లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా, 4,668 వార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా జిల్లాలో మాత్రం రెండు (ఫేజ్–2, ఫేజ్–3) విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.
ఓటర్ల వివరాలు
మొత్తం : 7,94,653
పురుషులు : 3,99,404
మహిళలు : 3,95,216
ఇతరులు : 33

స్థానిక నగారా

స్థానిక నగారా