
మీనాల మృత్యుఘోష
చర్యలు తీసుకోవాలి
మీర్‌పేట: మూడురోజుల క్రితం చెరువులోకి మురుగునీరు వదలడంతో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయి. ఆదివారం తేలి ఒడ్డుకు చేరుకోవడంతో వాకర్స్ గమనించి మత్స్యకారులకు సమాచారం అందించారు. వివరాలివీ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువులో ఎనిమిది నెలల క్రితం మత్స్య సొసైటీ ఆధ్వర్యంలో 4 లక్షల వరకు చేప పిల్లలను వదిలారు. తాజాగా 20 రోజుల క్రితం చేపలు పట్టడం ప్రారంభించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బడంగ్‌పేట ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరదనీటి ప్రవాహానికి తోడు మురుగునీటిని కూడా ట్రంక్‌లైన్ ద్వారా నేరుగా చెరువులోకి వదిలారు. దీంతో 3 నుంచి 5 కిలోలు ఉన్న భారీ సైజు చేపలు సైతం మృతి చెందాయి. పట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్న చేపలు ఇంతలోనే మృత్యువాత పడడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. చెరువులో మురుగునీరు కలపొద్దని తాము ఎన్నిసార్లు మున్సిపాలిటీ వారికి చెప్పినా పట్టించుకోలేదని, గత సంవత్సరం లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలన్నీ మృతి చెంది ఒడ్డుకు చేరుకోవడంతో చెరువు పరిసర ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. భరించలేని వాసన రావడంతో వాకింగ్ చేయలేకపోతున్నామని వాకర్స్ తెలిపారు. మృతి చెందిన చేపలను వెంటనే సంబంధిత అధికారులు తొలగించే చర్యలు తీసుకోవాలని కోరారు.
మీర్‌పేట చెరువులో కుప్పలుగా తేలిన చేపలు
చెరువు ప్రాంతమంతా దుర్వాసన
రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్టు అంచనా
మురుగునీరు కలవడంతో మృతి చెందాయంటున్న మత్స్యకారులు
మురుగునీరు చెరువులోకి వదలడంతో చేపలన్నీ మృతి చెందాయి. గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది. ఈ ఏడు పెద్ద ఎత్తున చేప పిల్లలను చెరువులో వదలడం జరిగింది. 3 నుంచి 5 కిలోల వరకు పెద్దవయ్యాక మృత్యువాత పడడం బాధాకరం. భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– గువ్వల శ్రీకాంత్, మత్స్యకారుడు