
రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
ఆమనగల్లు: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీఓలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన ఐదు విడతల డీఏను వెంటనే ప్రకటించాలని అన్నారు. నగదు రహిత హెల్త్‌కార్డులు అందించాలని, నూతన పీఆర్‌సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, ఆమనగల్లు శాఖ అధ్యక్షుడు కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
ఆమనగల్లు సెక్టార్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామనాథం, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, ఆర్థిక కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంగలి బాలకృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా వెంకట్‌రెడ్డి, సుజాత, సంయుక్త కార్యదర్శిగా నారాయణగౌడ్, కార్యదర్శిగా హరికిషన్‌రెడ్డి, ప్రచార కార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కౌన్సిలర్‌లుగా పురుషోత్తంరెడ్డి, భద్రయ్య, నర్సిరెడ్డి, విద్యాధర్, మహాలింగం, ఆంజనేయులు ఎన్నికయ్యారు.