
వానొస్తే.. గండమే!
రోడ్లపై వంతెనలు లేక తీవ్ర ఇక్కట్లు
కొందుర్గు: గ్రామాల్లో వాగులపై వంతెనలు లేకపోవడంతో సామాన్యులు ప్రాణాలు కోల్పోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు ఉప్పొంగడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ ఏడాది కురుస్తున్న అధిక వర్షాలకు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏ చిన్న పని కోసం బయటికి వెళ్లాలన్నా వాగులు దాటాలి. వాటిపై వంతెనలు లేకపోవడంతో బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారా లేదా అనే సందిగ్ధం నెలకొంది.
ఘటనలు అనేకం
పదేళ్ల క్రితం కొందుర్గు మండలం ముట్పూర్ గ్రామానికి చెందిన కావలి సత్యమ్మ పంట పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటే ప్రయత్నంలో వరదలో కొట్టుకుపోయి మృతిచెందింది. రెండేళ్ల క్రితం విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన జాహంగీర్ పక్క గ్రామమైన తంగెళ్లపల్లికి వెళ్లి వస్తుండగా చిన్న వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా శుక్రవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్కెపల్లి సత్తయ్య పక్క గ్రామమైన ఇంద్రానగర్ వెళ్లి తిరిగి వస్తుండగా వాగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామానికి లింగమయ్య(42) శుక్రవారం సాయంత్రం విశ్వనాథ్‌పూర్ నుంచి తంగెళ్లపల్లి వెళ్లే ప్రయత్నంలో వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. శనివారం ఉదయం వాగు పక్కన ముళ్లపొదలకు తట్టుకొని శవమై తేలాడు. ఇలా వంతెనలు లేకపోవడంతో అభాగ్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్లపై వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుం ఇవన్నీ సర్కారు హత్యలే. గడిచిన పదేళ్లలో వంతెనలు నిర్మించలేదు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు వంతెనల కోసం పాదయాత్రలు చేశారు. కానీ ప్రస్తుతం వాగులు దాటుతూ ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.
– లక్ష్మీకాంత్‌రెడ్డి, బీజేపీ కొందుర్గు అధ్యక్షుడు
వరద ఉధృతి ఎక్కువ
గతంలో గ్రామాలకు వెళ్లే దారుల్లో లో లెవల్ వంతెనలున్నాయి. ప్రస్తుతం వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. అన్ని గ్రామాలకు వెళ్లే దారుల్లో హైలెవల్ వంతెనలు నిర్మించాలి. ఇప్పటికే విశ్వనాథ్‌పూర్ చిన్న వాగు దాటుతూ ఇద్దరు మృతిచెందారు. ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయినా అత్యవసరంగా వంతెనలు పూర్తి చేయాలి.
– శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కొందుర్గు అధ్యక్షుడు
వాగు దాటే క్రమంలో
ప్రాణాలు కోల్పోతున్న వైనం
వరద ప్రవాహంలో
కొట్టుకుపోయి ముగ్గురు మృతి
పట్టించుకోని పాలకులు, అధికారులు
వంతెనలు లేని గ్రామాలు
కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రి, ముట్పూర్, టేకులపల్లి, ఉత్తరాసిపల్లి, ౖబైరంపల్లి, లాలపేట, గంగన్నగూడ, విశ్వనాథ్‌పూర్, జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల, తూంపల్లి, తుమ్మలపల్లి, లచ్చంపేట, పద్మారం, చేగిరెడ్డిఘనాపుర్, జాకారం, గుంజల్‌పహాడ్, పీర్జాపూర్, ముష్టిపల్లి తదితర గ్రామాలకు వెళ్లే దారుల్లో వంతెనలు లేకపోవడంతో వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోతాయి.

వానొస్తే.. గండమే!

వానొస్తే.. గండమే!