
ఇళ్ల కూల్చివేతలపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమంగా ఇళ్లను కూల్చి వేసిన వారిపై ఆదిబట్ల పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 4 జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నోయల్‌రాజ్ కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ, శ్రీశ్రీనగర్ కాలనీలో సర్వే నంబరు 338లో ఉన్న ప్లాటు నంబరు 140, 143, 163 నుంచి 166 వరకు గల ప్లాట్లను గుర్రం జైపాల్‌రెడ్డి, కర్ర గోవర్ధన్‌రెడ్డిల ప్రోత్సాహంతో నేనావత్ అశోక్‌కుమార్, రత్లావత్ రవి 20 రోజుల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శనివారం తెల్లవారు జామున 5 జేసీబీలు తీసుకొచ్చి 9 ఇళ్లను కూలగొట్టి ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి సామాన్లు బయట వేశారు. ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు. కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
బంజారాహిల్స్: నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లుగప్పి తెల్లవారుజాము వరకు పబ్ నిర్వహిస్తున్న యజమానిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36లోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఎన్–ఓల్ అనే పబ్ రాత్రి ఒంటి గంటకు కార్యకలాపాలు ముగించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు కస్టమర్లకు లిక్కర్ సరఫరా చేయడమే కాకుండా డీజే సౌండ్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా పబ్‌లో కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఎన్–ఓల్ పబ్ యజమాని చిలంకుర్తి శంకర్, మేనేజర్ వీరగోని వంశీ, బౌన్సర్లు మహమూద్, సూర్యకిరణ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గామాతకు ఎంపీ పూజలు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ దుర్గమాతను ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. శివాలయం వీధిలో కొలువైన అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎంపీని సన్మానించారు.
సికింద్రాబాద్: పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం, సమస్తిపూర్ జిల్లా, దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన హీరా కుమార్(31) మల్లాపూర్‌లోని ఎఫ్‌సీఐ గోదాములో హమాలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 27న తన స్నేహితుడు అభిషేక్ అనే వ్యక్తిని రైలు ఎక్కించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి దర్బంగా ఎక్స్‌ప్రెస్ రైలెక్కించాడు. మల్లాపూర్‌లోని తన రూమ్‌కు తిరిగి వెళ్లేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు హీరా కుమార్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.