
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కందుకూరు మండల పరిధిలోని బేగరికంచె గ్రామానికి చెందిన ఢిల్లీ రాంచంద్రి(50) అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మీరాఖాన్‌పేటలో వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చి తిరిగి బైక్‌పై ఆదివారం రాత్రి 7 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఆయన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రాణి, ముగ్గురు పిల్లలున్నారు. ఇదిలా ఉండగా ఫ్యూచర్‌సిటీ కార్యాలయ శంకుస్థాపనకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో పోలీసులు మీరాఖాన్‌పేట–కందుకూరు గ్రామాల మధ్య డబుల్‌రోడ్డులో ఒక మార్గాన్ని పూర్తిగా మూసేశారు. సాయంత్రం వరకు క్లియర్ చేయకపోవడంతో వన్ వేలోనే ఎదురెదురుగా వాహనాల రాకపోకలు సాగించాయి. ఈ క్రమంలోనే రాంచంద్రి మృతి చెందినట్లు బేగరికంచె గ్రామస్తులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఔటర్‌పై కారు బోల్తా:
ఐటీ ఉద్యోగి..
శంషాబాద్: ఔటర్‌పై అదుపు తప్పి కారు బోల్తా పడటంతో ఐటీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్‌కుమార్(35) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శనివారం రాత్రి అతను భార్య జానకమ్మతో పాటు ఆమె సోదరుడు ఉదయ్ భాస్కర్‌రెడ్డి పిల్లలతో కలిసి ప్రకాశం జిల్లా నుంచి కారులో మణికొండకు బయలుదేరారు. తెల్లవారు జామున శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడిన అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమార్తె నితిష, ఉదయ్‌భాస్కర్‌రెడ్డిలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.