
‘భవిష్యత్తు’కు బాటలు
రోడ్డు ప్రత్యేకతలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీకి ఆదివారం ఉదయం అంకురార్పణ జరగబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీల తరహాలో ఈ కొత్త నగరానికి వడివడిగా బాటలు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు సహా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) ఆర్థిక సహాయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఫ్యూచర్‌సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట కేంద్రంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా ఇదే కేంద్రంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిపాలన భవనాలు సహా గ్రీన్‌ఫిల్డ్ రేడియల్ రోడ్డు–1కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
56 గ్రామాలు.. 765 చదరపు కిలోమీటర్లు
మొత్తం 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్‌సిటీ (ఫోర్త్ సిటీ)ని తీర్చిదిద్దనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు గ్రేటర్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏడు మండలాలు.. 56 రెవెన్యూ గ్రామాలు..765 చదరపు కిలోమీర్ల పరిధితో ఈ ఏడాది మార్చి 12న ఎఫ్‌సీడీఏను ఏర్పాటు చేసింది. సీనియర్ కలెక్టర్ శశాంకను కమిషనర్‌గా నియమించింది. కర్బన ఉద్గారాలు, ఇతర గ్రీన్‌హౌస్ వాయువులను పీల్చుకుని, మానవాళికి అవసరమైన ఆక్సిజన్‌ను ఇచ్చే వృక్ష సంపదను పెంచి, ఈ ప్రాంతాన్ని నెట్‌జీరో సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 వేల ఎకరాల్లో అర్బన్‌ఫారెస్ట్రీని అభివృద్ధి చేయనుంది.
13,973 ఎకరాలు.. పది జోన్లు
ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన 13,973 ఎకరాల భూమిని పది జోన్లుగా విభజించింది. దీనిలో 34 శాతం భూమిని ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ పరిశ్రమలకు కేటాయించించింది. ఆ తర్వాత లైఫ్‌సైన్స్ (ఫార్మా, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) హబ్‌కు 30 శాతం ప్రాధాన్యం ఇచ్చింది. 9 శాతం భూమిని రెసిడెన్షియల్ మిక్స్‌డ్ యూజెస్ కోసం, మరో ఏడు శాతం రెసిడెన్షియల్ జోన్ కోసం కేటాయించింది. స్పోర్ట్స్ హబ్‌కు ఐదు, హెల్త్, ఎడ్యుకేషన్, వినోదం, పర్యాటకం కోసం మూడు శాతం చొప్పున, ఫర్నిచర్, ఏఐ సిటీల కోసం రెండు శాతం చొప్పున భూములు కేటాయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కూడా సిద్ధం చేసింది. మీర్‌ఖాన్‌పేట్, బేగరికంచె, ముచ్చర్ల, పంజాగూడ రెవెన్యూల పరిధిలో ఫోర్త్‌సిటీతో పాటు దానికి ఇరువైపులా విద్య, వైద్యం, పర్యాటక, క్రీడా సంస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక జనావాసాలకు దూరంగా కుర్మిద్ద, కడ్తాల్ రిజర్వుడ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న భూములను ఫార్మా, ఆర్‌అండ్‌డీ పరిశ్రమలకు కేటాయించింది.
41.50 కి.మీ.. ఆరు లేన్లు
● రావిర్యాల ఇంటర్‌ఛేంజ్ నుంచి ఆమనగల్లు వరకు నిర్మించనున్న 41.50 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు (రతన్ టాటా రోడ్డు) పనులను రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ రోడ్డును రెండు దశలుగా నిర్మించనున్నారు.
● మొదటి దశలో రావిర్యాల నుంచి (టాటా ఇంటర్ చేంజ్) నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్లు పూర్తి చేస్తారు. ఇందుకోసం రూ.1,665 కోట్లతో అంచనాలు రూపొందించారు.
● రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ నుంచి ట్రిపుల్‌ఆర్ వద్ద ఆమనగల్లు వరకు రూ.2,365 కోట్లతో 22.3 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 14 గ్రామాలకు ఈ రోడ్డుతో అనుసంధానం ఏర్పడనుంది.
ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ప్రపంచ బ్యాంకు, జైకా ఆర్థిక సహాయంతో అభివృద్ధి
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మౌలిక సదుపాయాలు
ఎలక్ట్రానిక్, ఏఐ, హెల్త్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్ జోన్లు
నేడు ఎఫ్‌సీడీఏ భవనం, రేడియల్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన
ఇది 100 మీటర్ల వెడల్పుతో కూడిన యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. ఆరు లేన్ల ప్రధాన రహదారి (3+3 లేన్)
ఈ రహదారిని భవిష్యత్తులో 8 లేన్లకు (4+4) విస్తరించే అవకాశం ఉంది.
ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మధ్యలోనే మెట్రో కారిడార్ కోసం 20 మీటర్ల భూమిని కేటాయిస్తారు. ఈ మార్గంలో ఎట్ గ్రేడ్ (భూ మార్గంలో) గా మెట్రో కారిడార్ రానుంది.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు రెండు వైపులా 3–లేన్ల సర్వీస్ రోడ్లు ఉంటాయి. 2 మీటర్ల చొప్పున గ్రీన్‌బెల్ట్‌ను (పచ్చదనం) ఏర్పాటు చేస్తారు.
రెండు వైపులా 3 మీటర్ల సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే 2 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ ఉంటుంది. మరో 2 మీటర్ల యుటిలిటీ కారిడార్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.