
మైసిగండికి ట్రస్ట్ బోర్డు!
● వడివడిగా పడుతున్న అడుగులు
● ఇప్పటికే దేవాదాయ శాఖ నోటిఫికేషన్
● సభ్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ
● పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు
కడ్తాల్: దక్షిణ తెలంగాణలోనే అత్యంత పేరుగాంచిన మైసిగండి మైసమ్మ శివాలయ, రామాలయ దేవస్థానం ట్రస్ట్ బోర్డు (నాన్– హెరిడిటరీ) ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, మైసిగండి మైసమ్మ దేవత, శివ రామాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం కోసం ఈనెల 16న నోటిఫికేషన్ జారీ చేశారు. మైసిగండి మైసమ్మ ఆలయానికి ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఆదాయం సమకూరుతోంది. వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోగా 6ఏ ఆలయ హోదా పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు పాలక మండళ్లు నియమించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మైసిగండి మైసమ్మ ఆలయానికి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకానికి చర్యలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే త్తర్వులు జారీ చేశారు.
వార్షికాదాయం ప్రకారం..
దేవాలయాల వార్షికాదాయం ప్రకారం పాలకమండలి సభ్యులను నియమించనున్నట్టు సమాచారం. వార్షికాదాయం రూ.2 లక్షలు మొదలు రూ.25 లక్షలు ఉంటే ఏడుగురు సభ్యులు, రూ.25 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఉంటే 14 మంది సభ్యులను నియమించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వార్షికాదాయం రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆపైన ఆదాయం ఉన్న మైసిగండి మైసమ్మ ఆలయానికి 14 మంది సభ్యులను నియమించే అవకాశం ఉంది. పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. దేవాదాయ శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్, జాయింట్ కమిషనర్ హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ జోన్, సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ రంగారెడ్డికి నిర్ణీత నమూనాలో పంపించాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్రస్ట్ బోర్డు ఏర్పాటుతో అభివృద్ధి
ఆది, మంగళ, గురువారాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రత్యేకించి ఆలయం స్థానిక బంజారా ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబిస్తోంది. ఆలయం మరింత అభివృద్ధి చెందేందుకు పాలకమండలి సభ్యుల నియామకం దోహదపడుతుందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ఎవరికి వారు పైరవీలు
ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల పదవి కోసం ఆశవాహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవ, ధార్మిక సంస్థలకు చెందిన పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. తమకు ఉన్న పరిచయాలతో ఆయా స్థాయిల్లో ప్రముఖులను ప్రసన్నం చేసుకునే పని ప్రారంభించారని వినికిడి. నేతల ఆశీస్సులు ఎవరి ఉంటాయే వారినే పదవులు వరించే అవకాశం ఉండడంతో, ఆ దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని ప్రచారం సాగుతోంది.