
కొండా లక్ష్మణ్ త్యాగం మరువలేనిది
మహేశ్వరం: తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగం మరువలేనిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో శనివారం ఆయన విగ్రహాన్ని పద్మశాలీ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగశీలి బాపూజీ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసి కృషి అభినందనీయమన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై కొండా లక్ష్మణ్ బాపూజీ ఆలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన సిద్ధాంతాలను, ఉద్యమ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు బి.శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు కె.మనోహర్, మాజీ ఎంపీపీ ఎం.స్వప్న, శివగంగ ఆలయ మాజీ చైర్మన్ ఎం.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతిరూపం కొండా బాపూజీ
ఇబ్రహీంపట్నం రూరల్: త్యాగానికి ప్రతి రూపం కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. 110వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వరాష్ట్ర సాధన కోం, బలహీన వర్గాల బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. తెలంగాణవచ్చే వరకు ఎలాంటి పదవులు అనుభవించకుండా త్యాగం చేశారన్నారు. నేటి తరానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి కేశురాం, బీసీ సంఘల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి