
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మహిళా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్ కోసం లాటరీ పద్ధతిన కేటాయింపు నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిటీ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు చేపట్టినట్టు తెలిపారు. 21 జెడ్పీటీసీ స్థానాల్లో మూడు ఎస్టీ, నాలుగు ఎస్సీ, తొమ్మిది బీసీ, ఐదు జనరల్ కేటగిరీలకు కేటాయించినట్లు తెలిపారు. ఇదే ప్రాతిపదికన ఎంపీపీ స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెప్పారు. సంబంధిత రిజర్వేషన్ స్థానాల కేటాయింపు వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో తొమ్మిది చొప్పున స్థానాలను మహిళలకు కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.