
భగత్‌సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం
ఇబ్రహీంపట్నం: భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమిద్దామని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో శనివారం డీవైఎఫ్‌ఐ అధ్వర్యంలో భగత్‌సింగ్ సందేశ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారతదేశ విముక్తి కోసం స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరి కొయ్యకు ప్రాణాలర్పించిన వీర కిషోరం భగత్‌సింగ్ అని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భగత్‌సింగ్ ఆలోచనలకు విరుద్ధంగా మతోన్మాద విధానాలతో తినే తిండి, కట్టే బట్టపై ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. భగత్‌సింగ్ జీవిత చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్‌సింగ్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.జగన్, నాయకులు జంగయ్య, రాఘవేందర్, మహేశ్, వినోద్, లింగం, తరంగ్, శ్రీకాంత్, వంఽశీ, శివ పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్