
డీజీపీగా తులేకలాన్ బిడ్డ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ నూతన డీజీపీగా నియమితులైన శివధర్‌రెడ్డి మన జిల్లా వాసే. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు రాజకిషన్‌రెడ్డి –రాజ్యలక్ష్మి. అక్కలు నర్సమ్మ, అరుణమ్మ, రుద్రమ్మ, తమ్ముడు రంగనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రి కూడా అనతి కాలంలోని వారికి దూరమయ్యాడు. దీంతో మేనత్త అనంతమ్మ పెంపకంలో పెరిగాడు. ప్రాథమిక విద్య గున్‌గల్, తులేకలాన్ గ్రామాల్లో అభ్యసించాడు. అనంతరం రెండో అక్క నర్సమ్మ వద్ద హైదరాబాద్‌లోని లింబోలిఅడ్డాలో పెరిగాడు. చాదర్‌ఘాట్ బాలుర పాఠశాలలో విద్యాభ్యాసం సాగించాడు. ఇంటర్మీడియెట్ బడిచౌడిలోని చైతన్య కళాశాలలో, డిగ్రీ లక్డీకాపూల్‌లోని బీజేఆర్ డిగ్రీ కళాశాలలో, ఎల్‌ఎల్‌బీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు.
వ్యవసాయ పనులు చూస్తూ..
అప్పట్లో కూలీలు హర్తాల్ చేసే సమయంలో గ్రామానికి వస్తుండేవాడు. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చూసుకోవడం చేస్తుండేవాడు. ఎప్పుడూ చేతిలో కెరియర్ గైడెన్స్ పుస్తకం పట్టుకొని చదువుతుండడం అలవాటు. కెప్టెన్ లింగాల పాండురంగం అనే రిటైర్డ్ ఆర్మీమెన్ దగ్గర శిశ్యరికం చేస్తుండేవాడు. లా చదువుకొని న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగానే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. 1994లో ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు.
వివిధ హోదాల్లో..
మొదటి పోస్టింగ్ ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లిలో వచ్చింది. నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. గ్రేహౌండ్స్, స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఎస్పీగా, డీఐజీ, ఎస్‌ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో కీలకపాత్ర పోషించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు.
పేదల సంక్షేమానికి తోడ్పాటు
గ్రామస్తులతో శివధర్‌రెడ్డికి ఎనలేని అనుబంధం ఉంది. ఏటా దసరా, సంక్రాంతి పండగలకు గ్రామానికి విచ్చేసి స్థానికులతో మమేకమవుతుంటారు. గ్రామం అభివృద్ధిలో భాగంగా పేదలకు సొంత భూమిలో ఇళ్ల స్థలాలకు భూమి ఇచ్చారు. అంబేడ్కర్ భవనానికి, చర్చికి స్థలాలు కేటాయించారు. లైబ్రరీ నిర్మాణం కోసం కృషి చేశారు. అక్కాచెల్లెళ్ల వివాహాల కోసం వారికి భూములు రిజిస్ట్రేషన్లు చేశారు. ఇబ్రహీంపట్నం, తులేకలాన్ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. డీజీపీగా తమప్రాంతంవాసి నియమితులు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
పోలీస్‌బాస్‌గా శివధర్‌రెడ్డి నియామకం
స్వగ్రామంలో సామాజిక కార్యక్రమాలు
గ్రామ ప్రజలతో అనుబంధం

డీజీపీగా తులేకలాన్ బిడ్డ