
సేల్స్‌మెన్ దారుణ హత్య
● జల్‌పల్లి శ్రీరామ కాలనీలో ఘటన
● స్నేహితుడే హంతకుడు
పహాడీషరీఫ్: మంచి ఆదాయ మార్గంగా ఉన్న స్నేహితుడి పోస్ట్‌పై కన్నేసిన ఓ యువకుడు, అతన్ని దారుణంగా హత్య చేసిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికులు, ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన కొండకింది సురేందర్‌రెడ్డి జల్‌పల్లి శ్రీరామ కాలనీలోని తన షెడ్డును రాజస్థాన్‌కు చెందిన జగదీశ్ అనే వ్యక్తికి అద్దెకిచ్చాడు. ఇందులో ఖుష్బూ కలర్, కెమికల్స్ కంపెనీ నిర్వహణతో పాటు మిగిలిన స్థలంలో ముడి సరుకును నిల్వ ఉంచుతున్నారు. ఇందులో సన్వర్ మాల్ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా, రాజస్థాన్‌కు చెందిన టెక్ చందు తివారీ (35) అనే యువకుడు సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారు. టెక్ చందు తివారీ అసిస్టెంట్‌గా తన స్నేహితుడు ఇమ్రాన్‌ను నియమించుకొని, కంపెనీలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. రాజస్థాన్‌లో నివాసం ఉండే యజమాని కంపెనీపై అంతగా పర్యవేక్షణ చూపకపోవడంతో సేల్స్‌మెన్‌గా ఉన్న తివారీ వ్యాపారం మొత్తాన్ని తన కనుసన్నల్లో నడుపుతూ దండిగా డబ్బులు సంపాదించసాగాడు. ఈ విషయాన్ని తన అనుచరుడిగా ఉన్న ఇమ్రాన్‌తో పంచుకునేవాడు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ కూడా తనకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటూ తివారీతో తరచూ గొడవ పడేవాడు. అయినప్పటికీ అతడు పెద్దగా పట్టించుకోకపోవడంతో, తివారీని మట్టుబెట్టితే ఆ పోస్ట్ తనకు వస్తుందని భావించాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 10 గంటలకు వీరి గదికి వెళ్లిన సన్వర్ మాల్‌కు.. టెక్ చందు తివారీ మంచంపై మృతి చెంది కనిపించాడు. వెంటనే యజమాని, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా తివారీ తల వెనుక భాగంలో, కాలు, ఇతర భాగాలలో కత్తితో పొడిచిన గాయాలున్నాయి. మృతదేహం పక్కనే కత్తితో పాటు ఓ కర్ర లభ్యమైంది. తివారీ, ఇమ్రాన్‌ల నడుమ గొడవల కారణంగానే ఇమ్రాన్ హత్య చేసి పరారయ్యాడని సురేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇమ్రాన్ కోసం గాలింపు చేపట్టారు.