
అలుగు కాలువ తవ్వకం
● తొర్రూరు–బ్రాహ్మణపల్లి రహదారిలో పనులు
● హైడ్రా, ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న రైతులు
తుర్కయంజాల్: తొర్రూరు బ్రాహ్మణపల్లి రోడ్డులో శుక్రవారం హైడ్రా అధికారులు అలుగు కాలువ తవ్వడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధి తొర్రూరు ఎర్రకుంటలోని నీరు దిగువకు వెళ్లేలా తొర్రూరు–బ్రాహ్మణపల్లి రహదారిలో అలుగు నిర్మాణం చేపట్టేందుకు గత సంవత్సరం ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించగా స్థానిక రైతుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేశారు. అలుగు నిర్మాణం కోసం రోడ్డును తవ్విన అధికారులు తిరిగి పునరుద్ధరించకపోవడంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రహదారిలో పూర్తిగా వరదనీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు ప్రాంతవాసుల విజ్ఞప్తి మేరకు తాజాగా హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు ఎర్రకుంట కాలువ తవ్వకం చేపట్టారు. ఈ క్రమంలో అలుగు దిగువన తమ భూమి నుంచి కాలువను తీయొద్దంటూ తొర్రూరుకు చెందిన రైతులు రాజ్‌కిరణ్, ఇందిరమ్మ కుటుంబ సభ్యులు హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తమ పొలం నుంచి కాలువ తీస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకుంట చెరువు దిగువన కొందరి భూములను ఎఫ్‌టీఎల్ పరిధి నుంచి తొలగించడానికే అలుగు లేని చోట నుంచి కాలువ తవ్వుతున్నారని ఆరోపించారు. హైడ్రా అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తవ్వకం చేపట్టారు. అనంతరం హైడ్రా అధికారి తిరుమలేష్ మాట్లాడుతూ.. తొర్రూరు– బ్రాహ్మణపల్లి రహదారిలో నీరు భారీగా నిలిచిపోవడంతో ఇరు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం వరదనీరు వెళ్లడానికి కాలువ తవ్వుతున్నామని, ఇంకా అలుగు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. నిర్ధారణ అయిన తరువాతే అలుగు నిర్మాణం చేపట్టి కాలువను పూర్తి స్థాయిలో తవ్వుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ వంశీధర్‌గౌడ్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారి దినేష్, హయత్‌నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.