
నిషేధిత జాబితా భూములపై ఆరా
కోర్టు ఆదేశాలతో కదలిక
హైకోర్టు ఆదేశాల మేరకు కదిలిన రెవెన్యూ యంత్రాంగం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత జాబితాలో ఉన్న భూములపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామాల వారీగా ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవా దాయ, సీలింగ్ భూములు సహా ఏసీబీ, సీబీఐ, ఈడీ, కోర్టు కేసులున్న భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం ప్రకారం ప్రత్యేక జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. నిజానికి ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. జాబితా రూపకల్ప నపై క్షేత్రస్థాయి అధికారులకు పలు అనుమానాలు తలెత్తడంతో వివరాల సేకరణలో జాప్యం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం కలెక్టర్ నారాయణరెడ్డి ఇదే అంశంపై సంబంధత రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లతో చర్చించి స్పష్టత ఇచ్చారు. 80 శాతం భూముల డేటాను ఇప్పటికే సేకరించి కలెక్టరేట్‌కు చేరవేశారు. రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రక్రియ పూర్తికానుంది. ఈ నెలాఖరులోగా తుది జాబితా సిద్ధం చేసి హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఐజీఆర్‌ఎస్‌లో ఒకలా.. రెవెన్యూలో మరోలా
భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పర్యవేక్షణ లోపానికి తోడు రెవెన్యూ యంత్రాంగంలో నెలకొన్న అవినీతి, అక్రమాలతో అనేక ప్రభుత్వ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలో మొత్తం 12,43,035 ఎకరాల భూములు ఉండగా, వీటిలో 2,18,530.2 ఎకరాల ప్రభుత్వ, 64,803 ఎకరాలు అటవీ, 90,911 ఎకరాలు అసైన్డ్, 21,931.03 ఎకరాల భూదాన్, 9,360.01 ఎకరాల దేవాదాయ, 14,785.17 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఇక 9000కు పైగా సీలింగ్ భూములు ఉన్నట్లు అంచనా. సర్వే నంబర్లు, విస్తీర్ణానికి విరుద్ధంగా రికార్డులు ఉన్నాయి. భూ విస్తీర్ణానికి మించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. పాత పహాణీలకు భిన్నంగా ధరణి, భూ భారతి పోర్టల్‌లో భూముల స్వభావం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, కాస్తులో ఉన్న రైతుల పేర్లు నమోదయ్యాయి. పట్టా భూములు అసైన్డ్ భూములుగా.. సీలింగ్ భూములు పట్టాగా రికార్డయ్యాయి. సర్వే నంబర్‌లో ఒక రైతు కోర్టుకు వెళ్తే.. మిగిలిన రైతుల భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. పట్టా భూములను అసైన్డ్, సీలింగ్‌గా రికార్డు చేయడాన్ని సవాల్ చేస్తూ వందలాది మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో ఒకలా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో మరోలా వివరాలు నమోదై ఉండటాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. నిషేధిత జాబితాలో ఉన్న రికార్డులను పక్కగా సేకరించి పంపాల్సిందిగా రెవెన్యూశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది.
గ్రామాల వారీగా వివరాల సేకరణలో అధికారులు నిమగ్నం
రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లశాఖతో అనుసంధానం చేయనున్న ప్రభుత్వం
22–ఎలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలు ఉండగా, 22–1బిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు, 22–1సీలో వక్ఫ్, భూదాన్, దేవాదాయశాఖలకు సంబంధించిన భూములు, 22–1డిలో సీలింగ్ భూముల వివరాలు ఉంటాయి. 22–1ఇలో ఐటీ, ఈడీ, ఏసీబీ అటాచ్ చేసిన భూముల వివరాలతో పాటు కోర్టు కేసులకు సంబంధించిన సర్వే నంబర్లు ఉంటాయి. రెవెన్యూ రికార్డుల్లో ఒకలా .. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ విభాగంలో మరోలా వివరాలు నమోదై ఉండటం అనేక వివాదాలకు కారణమవుతోంది. నిషేధిత జాబితా నుంచి తమ పట్టా భూములకు విముక్తి కల్పించాల్సిందిగా బాధితులు జిల్లా రెవెన్యూ యంత్రాం గానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేక పోవడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. రెండు ప్రభుత్వ విభాగాల్లో ఆయా భూముల వివరాలు వేర్వేరుగా నమోదై ఉండటాన్ని కోర్టు తప్పు పట్టింది. పదిహేను వారాల్లోగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. రెండు రోజుల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల్లో తలెత్తిన సందేహాలు జాప్యానికి కారణమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెవెన్యూ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్‌ఆర్‌ఓల భూ జాబితాలోనూ మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఉంది.