
ఓయూలో ఎన్నికల హోరు
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాల సంఘాల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 27న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురువారం ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అబ్దుల్ కదీర్ ఖాన్, బి. వెంకటేశ్ ప్యానెల్ 43 హామీలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓయూ లోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ కదీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి బి.వెంకటేశ్ మాట్లాడుతూ.. తమ ప్యానెల్‌లోని 9 మందిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలిస్తే ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు పాటుపడతామన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, సీపీఎస్, ఓపీఎస్ విధానం అమలు చేయిస్తామన్నారు. పెన్షనర్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.