
వృద్ధులకు పోలీసుల కొండంత అండ
పహాడీషరీఫ్: నవ మాసాలు మోసి కనిపెంచిన పిల్లలు పట్టించుకోకపోవడంతో అనాథలైన వృద్ధులు.. పిల్లలు విదేశాలలో ఉంటూ యోగా క్షేమాలు పట్టించుకోకపోవడంతో ఒంటరైన వయోజనులకు రాచకొండ పోలీసులు బాసటగా నిలుస్తున్నారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సౌజన్యంతో కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఒంటిరిగా ఉంటున్న వయో వృద్ధులకు పోలీసులు అండగా ఉండేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డి స్థానికంగా ఉన్న దేవేందర్ నగర్ కాలనీ, రంగ నాయకుల కాలనీలలో నా అనే వారు లేక ఒంటరి జీవితం గడుపుతున్న వారిని గుర్తించి, వారి ఇళ్ల వద్దకే ఎస్‌ఐ దయాకర్ రెడ్డితో కలిసి స్వయంగా వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసి ఆహార పదార్థాలతో కూడిన కిట్లను అందజేశారు. ఒంటరిగా జీవనం వెళ్లదీస్తున్న పెద్దలు ఎవరూ కూడా అధైర్య పడరాదని సూచించారు. సమాజంలో పౌరులకు ఆపద సమయంలో కూడా సేవలందించేందుకు పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.