
అందరి చూపు.. రిజర్వేషన్ల వైపు
ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం అంతా ఇదే పనిలో నిమగ్నమైంది. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్, జెడ్పీ సీఈఓలు కలిసి జెడ్పీటీసీ స్థానాలకు ఆర్డీఓలు ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు, వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ జాబితాను గోప్యంగా ఉంచారు. సిద్ధం చేసిన రిజర్వేషన్ల తుది జాబితా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పోటీ చేయాలని భావించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న ఆశావహుల్లో ఈ రిజర్వేషన్ల అంశం మరింత ఉత్కంఠను రేపుతోంది. ఏ సీటు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో? తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ రిజర్వేషన్లు మారితే.. ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దించాలనే చర్చ సైతం మొదలైంది.
జీఓ విడుదల చేయడమే ఆలస్యం
జిల్లాలో 27 మండలాలు, 15 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 526 గ్రామ పంచాయతీలు, 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో హయత్‌నగర్, సరూర్‌నగర్, బాలాపూర్, గండిపేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లిపోయాయి. 21 మండలాలు మాత్రమే రూరల్ ఏరియాలో మిగిలాయి. ఆయా మండలాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించినట్లు తెలిసింది. ఎంపీపీ స్థానాలకు కూడా ఇదే రేషియోలో కేటాయించినట్లు సమాచారం. 97 ఎంపీటీసీ స్థానాలు, 221 పంచాయతీలు, 1,961 వార్డులను బీసీలకు కేటాయించినట్లు తెలిసింది. ప్రభుత్వం జీఓ విడుదల చేసిన తర్వాతే ఆయా రిజర్వేషన్ల స్థానాలను బయటికి వెల్లడించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన గడువు చివరి దశకు చేరింది. ఈ ఎన్నికలపై కోర్టు మళ్లీ జోక్యం చేసుకోకుండా ఉండాలంటే ప్రక్రియను ముందే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల వ్యవధిలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితా సహా రిజరేషన్ల జాబితాను సిద్ధం చేసి ఉంచింది. పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయనుండటంతో తొలుత పార్టీ గుర్తుపై జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా పార్టీలోని అంతర్గత విభేదాలు తొలగి.. మెజార్టీ పంచాయతీలను కై వసం చేసుకోవచ్చని భావిస్తున్న అధికార పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ముగిసిన రిజర్వేషన్ల ప్రక్రియ
కలెక్టర్ చేతిలో జాబితా
తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు కేటాయింపు
అదే రేషియోలో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలు
జీఓ విడుదల చేసిన వెంటనే వెల్లడించే అవకాశం