
ముంపు ముప్పు నుంచి కాపాడండి
● కబ్జాకు గురైన నాలాలనూ విస్తరించండి
● హైడ్రాకు విజ్ఞప్తి చేసిన పలువురు బాధితులు
సాక్షి, సిటీబ్యూరో: నాలాల ఆక్రమణలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. మంగళవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా.. వీటిలో 30కి పైగా నాలా ఆక్రమణలు, వరద ముంపునకు సంబంధించినవే. చెరువుల తూములు మూసేయడంతో పైన ఉన్న కాలనీలు నీట మునుగుతున్నాయని పలువురు ఫిర్యాదులు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామంలో బందం కొమ్ము చెరువు నాలాను డైవర్ట్ చేయడం వల్ల వరద సాఫీగా సాగక దాదాపు ఎనిమిది కాలనీలు వరదతో ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు మొరపెట్టుకున్నారు. యూసుఫ్‌గూడ కృష్ణా నగర్‌లో మురుగు, వరద నీరు ముంచెత్తుతోందని, ఏమాత్రం వర్షం కురిసినా ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నామని అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించిన చోట ప్రవాహం బాగున్నా మిగిలిన చోట్ల సమస్య ఉందని, నాలాలను విస్తరించాలని కోరారు. మియాపూర్ వద్ద ఉన్న మయూరీనగర్‌లో వరద నీటి నాలాను అబ్బులు అనే వ్యక్తి ఆక్రమించి, కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ..
కూకట్‌పల్లి మాధవి నగర్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కొందరు కాజేయాలని చూస్తున్నారని, ఆ ప్రాంత వెల్ఫేర్ సొసైటీ ఆరోపించింది. ఆరు ఎకరాల మేర ఉన్న ఈ లేఔట్‌లో 500 కుంటుంబాలు నివసిస్తున్నాయి. తట్టి అన్నారం మీదుగా ప్రవహించే నాలాకు అడ్డంగా ప్రహరీ నిర్మించడంతో వరద నీరు నిలిచిపోతోందని, తమ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చే విద్యార్థులు రాలేని పరిస్థితి ఉందని స్థానిక విద్యా సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సాహెబ్‌నగర్ కలాన్ చుట్టుపక్కల కాలనీలు నాగార్జున సాగర్ రోడ్డు వైపు నుంచి వచ్చే వరదతో నీట మునుగుతున్నాయని, కప్పల చెరువు పూర్తి స్థాయిలో నిండి ఎగువన ఉన్న కాలనీలు కూడా నీట మునుగుతున్నాయని పలువురు పేర్కొన్నారు.