
సరిపడా రాక.. వెతలు తీరక
యాచారం: అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం తెల్లవారుజాము నుంచే మండల కేంద్రాల్లో ఉన్న పీఏసీఎస్‌ల వద్దకు రైతులు క్యూ కడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని, పాడి సంరక్షణ చూసుకోకుండానే యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఈ సీజన్‌లో వరి, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది తదితర పంటలను 55 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. యాచారం, మంచాల వ్యాప్తంగా పత్తి, వరి అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఆయా మండలాల్లో పత్తి పంటను 2,500 ఎకరాల్లో సాగు చేయగా, అత్యధికంగా వరిని 25 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు.
పీఏసీఎస్‌ల వద్ద క్యూ
రాయితీపై అందజేసే యూరియాను పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. బస్తా యూరియా రూ.266.05కే లభిస్తుంది. తక్కువ ధరకు లభించే యూరియా ప్రైవేట్ వ్యాపారులతో విక్రయిస్తే ధరలు పెంచి రైతులను మోసం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం పీఏసీఎస్‌ల పర్యవేక్షణలో సరఫరా చేస్తోంది. యూరియా బస్తాల కోసం రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు ఆధార్ కార్డుల వివరాలు అందిస్తున్నారు. పలు గ్రామాల్లోని ఒక్కో రైతుకు సాగు చేసిన పంటకు సరిపడా యూరియా అందడం లేదని వాపోతున్నారు.
అందిన 2,101 మెట్రిక్ టన్నులు
ఈ వానాకాలం కింద ఇబ్రహీంపట్నం డివిజన్‌కు 2,101.205 మెట్రిక్ టన్నుల యూరియా అందింది. ఇందులో అబ్దుల్లాపూర్‌మెట్–227.875, హయత్‌నగర్–100.00, ఇబ్రహీంపట్నం–934.915, మంచాల–330.00, యాచారం–508.415 మేర యూరియా సరఫరా చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండుమైలారం, రాయపోల్, పోల్కంపల్లి, ముకునూర్, తుర్కగూడ, కప్పాడు, చర్లపటేల్‌గూడ తదితర గ్రామాల్లో వరి పంటను అత్యధికంగా సాగు చేశారు. అందుకే 934.915 మెట్రిక్ టన్నుల యూరియాను అందించారు. రైతులు ఎకరాకు కేవలం ఒకటి లేదా, రెండు బస్తాల యూరియా అందించాల్సి ఉండగా మూడు నుంచి నాలుగు బస్తాల యూరియాను వాడుతున్నారు.
రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు
మోతాదుకు మించి వాడకంతో ఏర్పడిన కొరత
ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 55 వేల ఎకరాల్లో సాగైన పంటలు
వెల్లడించిన వ్యవసాయశాఖ అధికారులు
పడరాని పాట్లు
ఈ సీజన్‌లో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఆరు ఎకరాల్లో వరి పంట, 18 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తంగా 55 బస్తాల యూరియాను వాడాను. దీనికోసం యాచారం పీఏసీఎస్‌తో పాటు ఉప్పరిగూడ, తుర్కయంజాల్ పీఏసీఎస్‌ల వద్దకు వెళ్లి యూరియా తెచ్చాను. – బాషా, రైతు, నక్కర్తమేడిపల్లి
అధికంగా వాడితే నష్టం
యూరియా వాడకంలో రైతులకు ఎంత చెప్పినా వినడం లేదు. డివిజన్‌కు 2,101 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా వచ్చింది. ఏ పంటకై నా ఒక బస్తా యూరియా చల్లాలి. కానీ రైతులు ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాలు చల్లుతున్నారు. యూరియా అధికంగా వాడితే నష్టమే తప్పా, లాభం ఉండదు.
– సుజాత, ఏడీఏ, ఇబ్రహీంపట్నం

సరిపడా రాక.. వెతలు తీరక

సరిపడా రాక.. వెతలు తీరక