
భూ సేకరణ వేగవంతం చేయండి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
బంజారాహిల్స్: గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్–సిటీ పనులకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని, పనుల గ్రౌండింగ్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) భాస్కర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు కేబీఆర్ పార్కు ప్రాజెక్టు భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెచ్–సిటీలో కీలకమైన కేబీఆర్ పార్కు ప్రాజెక్టులో భాగంగా చుట్టుపక్కల ఏడు కీలక జంక్షన్లలో రాబోయే రోజుల్లో 4.6 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్లు, 2.8 కిలోమీటర్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. వీటితో నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహం సులభతరం కావడంతో పాటు, రద్దీ గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ కేబీఆర్ పార్కు ప్రాజెక్టు గ్రౌండింగ్‌కు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పనుల గ్రౌండింగ్ వేగంగా చేపట్టడంతో పాటు పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.